ఫలితం.. జాప్యం!

Javahar Navodaya Results Still Pending In YSR kadapa - Sakshi

రెండు నెలలు దాటినా విడుదలకాని జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు

జిల్లా వ్యాప్తంగా 4731 మంది ఎదురుచూపు

కడప ఎడ్యుకేషన్‌: కేంద్ర ప్రభుత్వ విద్యాలయ ప్రవేశంలో భాగంగా జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్షను జిల్లావ్యాప్తంగా ఏప్రిల్‌ 21వ తేదీన నిర్వహించారు. పరీక్ష నిర్వహించి రెండు నెలలు దాటినా నేటికీ çఫలితాలు విడుదల కాకపోడవంతో వేలమంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావస్తున్నా నేటికి నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నవోదయ పాఠశాలలో సీటు వస్తుందా లేక బయట స్కూల్స్‌లో చేర్చాలా అనే సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు.

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్‌ విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల మంత్రిత్వశాఖ పరిధిలో జిల్లాలోని రాజంపేట మండలం నారమరాజుపల్లెలో జవహర్‌ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేశారు. ఇందులో ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఆరో తరగతిలో 80 సీట్ల ప్రవేశం కోసం ప్రతి ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఎస్సీకి 14 శాతం, ఎస్టీకి 7.5 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు ఉండగా జనరల్‌కు 60 సీట్లు, మిగతా 20 శాతం పట్టణ ప్రాంతాలకు సీట్లను కేటాయించారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 12వ తరగతి వరకు వసతితో కూడిన విద్యనందిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 21న జిల్లాలో 21 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించగా మొత్తం 5779 మందికి గాను 4731 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.

రెండు నెలలు పూర్తి అయినా
పరీక్ష నిర్వహించి రెండు నెలలు దాటినా నేటికి ఫలితాలరె విద్యాలయ సమితి వెల్లడించకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదురు చూడటంతోపాటు ఆందోళన చెందుతున్నారు. 80 సీట్లు భర్తీ చేసేందుకు నిర్వహించిన పరీక్ష పోటీ బాగా ఉండటంతో సీటు ఎవరికి వస్తుందో ఏయే ప్రాతిపధికన ప్రవేశం ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఫలితాలను వెల్లడించిన అనంతరం వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం మరి కొంతకాలం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఫలితాలను విడుదల చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

త్వరలో రావొచ్చు
పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న మాట వాస్తవమే. ఇందుకు సంబంధించిన ఫలితాల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మాకు ఫోన్స్‌ వస్తున్నాయి. మేము కూడా ఫలితాల కోసం ఫాలప్‌ చేస్తున్నాం.  త్వరలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.– కేకే సురేష్‌బాబు, జవహర్‌ నవోదయ ప్రిన్సిపల్, నారమరాజుపల్లె

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top