న్యాయవాదులపై వరాల జల్లు

Jagan Promise For The Rise In Stifund For Junior Lawyers - Sakshi

సాక్షి, ఏలూరు (సెంట్రల్‌) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రకటించిన మేనిఫెస్టోలో న్యాయవాదులకు చోటు కల్పించడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సుమారు 10 వేల మంది  న్యాయవాదులు ఉండగా వారిలో 4 వేల మంది వరకు జూనియర్‌ న్యాయవాదులు ఉన్నారు. సీనియర్‌ న్యాయవాదులతో పాటు,  జూనియర్‌ న్యాయవాదులకు పలు సంక్షేమ ఫలాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.

జూనియర్‌ న్యాయవాదులకు మొదటి మూడు సంవత్సరాల ప్రాక్టీస్‌ పిరియడ్‌లో ప్రతి నెల రూ.5 వేలు స్టైఫండ్‌ ఇవ్వడంతో న్యాయవాదులకు హెల్త్‌ కార్డులు మంజూరు, ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని జగన్‌ ప్రకటించారు.ఆ నిధికి రూ.100 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాదులకు తక్కువ ధరకే ఇళ్లస్థలాలు ఇవ్వడం, న్యాయవాది చనిపోయిన సమయంలో ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా రూ.3 లక్షలను రూ.10 లక్షలకు పెంచడం ద్వారా న్యాయవాది కుటుంబాలకు భరోసా కల్పించడం అవుతుందని పలువురు సీనియర్‌ న్యాయవాదులు చెబుతున్నారు. 

స్టైఫండ్‌ పెంపు అభినందనీయం
న్యాయవాద వృత్తికి వచ్చిన కొత్తలో సీనియర్‌ న్యాయవాది దగ్గర జూనియర్‌గానే చేయాలి. అప్పుడు చాలాకాలం పాటు కేసులు ఉండకపోవడంతో కష్టంగా మారుతుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జూనియర్‌ న్యాయవాదులను గుర్తించి, ప్రాక్టీస్‌ పిరియడ్‌లో జూనియర్‌ న్యాయవాదులకు ఇచ్చే స్టైఫండ్‌ను రూ. వెయ్యి నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం అభినందనీయం.
– దొండపాటి శౌరి, జూనియర్‌ న్యాయవాది

టీడీపీకి గుణపాఠం చెబుతాం 
గత ఎన్నికల ముందు  చంద్రబాబు న్యాయవాదులకు అనేక హామీలు ఇచ్చారు. వాటిని ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. న్యాయవాదులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గతంలో విజయవాడలో ధర్నా చేసేందుకు సిద్ధం అయిన సమయంలో అప్పుడు మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్‌  న్యాయవాదులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు.  తిరిగి ఎన్నికలు వచ్చిన న్యాయవాదులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. న్యాయవాదులందరూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెబుతాం. 
– తేతలి శశిధర్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాది

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top