జిల్లా అధికారులు చెప్పిన దానికంటే నష్టం ఎక్కువే జరిగిందని, ఈ విషయం తమ పరిశీలనలో అర్థమైందని పంటనష్టాన్ని అంచనా వేసేం దుకు వచ్చిన కేంద్ర బృందం పేర్కొంది.
దేవరకొండ, న్యూస్‌లైన్: జిల్లా అధికారులు చెప్పిన దానికంటే నష్టం ఎక్కువే జరిగిందని, ఈ విషయం తమ పరిశీలనలో అర్థమైందని పంటనష్టాన్ని అంచనా వేసేం దుకు వచ్చిన కేంద్ర బృందం పేర్కొంది. మంగళవారం జిల్లాలో పర్యటించిన బృందం సభ్యులు ఎ.చంద్రశేఖర్, కె. శ్రీరామవర్మలు దేవరకొండలోని అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తాము కేంద్రానికి పంట నష్టం అంచనా రిపోర్టును అందించిన 15 రోజుల్లోపు నిధులు మంజూరవుతాయని తెలిపారు. జిల్లాలో 108శాతం వర్షపాతం నమోదయిందని, వేలాది హెక్టార్లల్లో పంట నష్టం జరిగిందని వారు తెలి పారు. జిల్లా అధికారులు ఇప్పటికే తమకు పంటనష్టంపై ఒక రిపోర్టును సమర్పించారని, అందులో 2 లక్షల 17 వేల హెక్టార్ల నష్టం జరిగిందని పేర్కొన్నారని చెప్పారు.
అయితే, తాము మిర్యాలగూడ,పెద్దవూర మండలాల్లో పర్యటించిన తర్వాత అధికారులు చెప్పిన దానికంటే నష్టం అధికంగా ఉందన్న విషయం అర్థమైందన్నారు. ఎకరానికి నష్టపరిహారం రూ.10వేలు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ బృందం సభ్యులను కోరారు. దీనిపై బృందం సభ్యులు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే నష్టపరిహారం అందుతుందని, ఆ విషయం తమ పరిధిలోకి రాదని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే బాలునాయక్, ఆర్డీఓ రవినాయక్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రావు, జేడీఏ నర్సింహరావు, మిర్యాలగూడ ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్‌రెడ్డి తదితరులున్నారు.