లెక్క తేలింది | It was found that the number | Sakshi
Sakshi News home page

లెక్క తేలింది

Feb 6 2014 3:04 AM | Updated on Oct 20 2018 6:17 PM

జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో అవినీతి లెక్కతేలింది. నిధుల గోల్‌మాల్ వ్యవహారం కొలిక్కి వచ్చింది.

నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో అవినీతి లెక్కతేలింది. నిధుల గోల్‌మాల్ వ్యవహారం కొలిక్కి వచ్చింది. గుంటూరు ఎస్‌ఈ రాజారావు ఐదునెలల పాటు నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. గుంటూరులో నిధుల కుంభకోణం వ్యవహారంలో ఆధారాలతో సహా చిక్కి ఆయన సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో సీఈ జగన్‌మోహన్ ఆధ్వర్యంలో నెల్లూరులో కూడా విజి లెన్స్ కమిటీ రెండు రోజులు విచారణ జరిపి  రూ.3.66 కోట్లు పక్కదారి పట్టినట్టు లెక్కలు తేల్చింది.
 
 ఇందులో రూ.1.85 కోట్లను నెల్లూరు నుంచి గుంటూరు ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయానికి డైవర్ట్ చేశారు. మరో రూ.1.19 కోట్లను సెల్ఫ్ చెక్కుల రూపంలో డ్రా చేశారు. ఇందులో రూ.26 లక్షలను జిల్లాలో వాహనాల కొనుగోలుకు ఉపయోగించారు. మిగతా డబ్బును దిగమింగారు. మరో రూ.62 లక్షలను సమ్మె కాలంలో ఉద్యోగులకు చెల్లించేందుకు సెల్ఫ్ చెక్కుల ద్వారా డ్రా చేశారు. ఈ సొమ్మును అధికారులు రికవరీ చేశారు.   
 
 సీనియర్ అసిస్టెంట్‌ను నిలదీసిన సీఈ
 విచారణ సందర్భంగా సీఈ జగన్‌మోహన్ చెక్కులను రాసిన సీనియర్ అసిస్టెంట్ శీనయ్యను నిలదీశారు. కలెక్టర్‌కు తెలపకుండా చెక్కులను ఎలా రాస్తావని గద్దించారు. సీనియర్ అసిస్టెంట్ సమాధానమిస్తూ ఎస్‌ఈ రాజారావు చెక్కులు రాయమంటేనే రాశానని, అంతకు మించి తనకేమీ తెలియదన్నారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్‌ను కూడా నిలదీశారు.
 
 డబ్బులు డీడబ్ల్యూఎస్‌ఎం పథకానివి...
 ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలో ఎస్‌ఈ అకౌంట్‌లో ఒక్క రూపాయి కూడా ఉండదు. ఈ అకౌంట్ నుంచి నిధులు డ్రా చేసేందుకు కుదరదు. అయితే జిల్లా తాగునీటి పథక మేనేజ్‌మెంట్ (డీడబ్ల్యూఎస్‌ఎం) పథకాానికి కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేసింది. దీనికి కార్యదర్శిగా ఎస్‌ఈనే వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌కు కూడా తెలియకుండా, పై అధికారులు అనుమతి తీసుకోకుండా సెల్ఫ్ చెక్కుల రూపంలో నిధులను అప్పటి ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మింగేశారు.
 
 బలికాబోతున్న చిరు ఉద్యోగులు
 ఈ అవినీతి వ్యవహారంలో నేరుగా ఆర్‌డబ్ల్యూఎస్, డీఈ, ఈఈలకు సంబంధం ఉన్నట్టు ఆధారాలు దొరకలేదు. అయితే డీడబ్ల్యూఎస్‌ఎం పథకం ద్వారా నిధులను డ్రాచేసే విషయంలో ఎస్‌ఈ ఆదేశాల మేరకు సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు తెలిసి చేసినా, తెలియక చేసినా సహకారం అందించారు. వీరి ద్వారా విజిలెన్స్ కమిటీ స్టేట్ మెంట్ తీసుకుంది. రికార్డులను హైదరాబాద్‌కు విజిలెన్స్ కమిటీ అధికారులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆధారాలు దొరికిన చిరుద్యోగులపై వేటు పడే అవకాశం ఉంది. దీంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. అవినీతిలో తమకు ఎలాంటి సంబంధం లేదని, పై అధికారిగా ఎస్‌ఈ ఆదేశాల మేరకే చెక్కులు రాశామని చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement