మాగుంట కంపెనీల్లో ఐటీ జల్లెడ | IT Raids on Magunta Srinivasulu Reddy Industries | Sakshi
Sakshi News home page

మాగుంట కంపెనీల్లో ఐటీ జల్లెడ

Dec 10 2018 1:02 PM | Updated on Dec 10 2018 1:02 PM

IT Raids on Magunta Srinivasulu Reddy Industries - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై చెన్నైలో వరుసగా మూడో రోజు ఐటీ దాడులు కొనసాగాయి. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాతోపాటు చెన్నై, మిగిలిన ప్రాంతాల్లో మాగుంటకు చెందిన 13 బాలాజీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలు,  వాటి కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఆదివారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగదు, బంగారంతో పాటు ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్ల పరంగా ఉన్న ఆస్తులకు, పన్ను చెల్లింపులకు పొంతన లేనట్లుగా ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మాగుంటకు సంబంధించిన కొందరు వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని ఐటీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. గత నెల 30న చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో రూ.11 కోట్ల హవాలా సొమ్ముతో పాటు 7 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీంట్లో ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు కొరియన్లతో పాటు ఐదుగురు వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో ఎమ్మెల్సీ మాగుంటకు చెందిన కీలక సమాచారం బయటపడినట్లు తెలుస్తోంది. పట్టుబడిన వారు ఇచ్చిన సమాచారంతో ఐటీ అధికారులు మాగుంటకు చెందిన బాలాజీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలు, కార్యాలయాలపై దాడులకు దిగినట్లు తెలుస్తోంది.

హవాలా రాకెట్‌తో లింకులపై ఆరా
టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డికి, హవాలా వ్యాపారులతో ఉన్న సంబంధంపై చెన్నైతో పాటు ఏపీ, తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నిజంగానే హవాలా రాకెట్‌తో మాగుంటకు సంబంధాలు ఉన్నాయా..? అన్న విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే హవాలా రాకెట్‌కు సంబంధించి చాలా మంది ప్రముఖ వ్యాపార వేత్తలకు  కీలక పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడినట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీ నేతలు ఎమ్మెల్సీ మాగుంటపై రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఐటీ అధికారులు నోరు విప్పితే కాని వాస్తవాలు బయటకు తెలిసే అవకాశం లేదు. మాగుంటపై ఐటీ దాడులు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement