హాట్‌ కేకుల్లా ఐపీఎల్‌ టిక్కెట్లు 

IPL Tickets Online Booking In Visakhapatnam - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: ఐపీఎల్‌ లీగ్‌ దశ పోటీలు ముగిశాయి. అన్ని క్రికెట్‌ ఫార్మాట్లకు ఆతిథ్యమిచ్చిన వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం ఈసారి ఐపీఎల్‌ తుదిపోరుకు అర్హత సాధించే జట్టు ఎంపికకు వేదిక కానుంది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ జట్ల హోమ్‌ గ్రౌండ్‌లలోనే మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, ఎన్నికల కారణంగా వైఎస్సార్‌ స్టేడియంను ఆపద్ధర్మంగా నాకౌట్, క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లకు విశాఖను వేదికగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
ఈసారి ఎలిమినేషన్‌ మ్యాచ్, రెండో క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌ కూడా విశాఖలో జరగనున్నాయి. తొలిసారిగా ఐపీఎల్‌ నాకౌట్‌ మ్యాచ్‌లకు వేదికగా నిలిచిన వైఎస్సార్‌ స్టేడియంలో మ్యాచ్‌లు రాత్రి ఏడున్నరకే ప్రారంభం కానున్నాయి. ఎలిమినేషన్‌ మ్యాచ్‌ 8న, రెండో క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌ 10న ఇక్కడ జరగనున్నాయి.

ఫైనల్స్‌ జట్లను తేల్చేది ఇక్కడే
12వ సీజన్‌ ఐపీఎల్‌ టోర్నీ నాకౌట్‌ పోటీలు ఖరారయ్యాయి. తొలి క్వాలిఫయింగ్‌ రౌండ్‌ ఏడో తేదీన చెన్నైలో జరగనుంది. ఎలిమినేషన్‌ మ్యాచ్, రెండో క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌ విశాఖ వేదికగానే జరగనున్నాయి. ఫైనల్‌ పోరు హైదరాబాద్‌లో జరగనుంది.  ఐపీఎల్‌లో ఎనిమిది జట్లు టైటిల్‌ కోసం పోటీపడిన సంగతి తెలిసిందే.  ప్రతి జట్టు పధ్నాలుగు మ్యాచ్‌లను లీగ్‌ దశలో ఆడింది.  లీగ్‌ దశ శనివారంతో ముగిసింది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లే ప్లేఆఫ్‌కు చేరి నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి.

వాటిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు చెన్నైలో జరిగే తొలి క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో ఆడనున్నాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేషన్‌ మ్యాచ్‌ ఆడతాయి. ఈ మ్యాచ్‌ విశాఖలో జరగనుంది. లీగ్‌ చివర్లో సీఎస్‌కే, ఎంఐ జట్లు అంచనాలు తారుమారు చేశాయి. నిరుటి రన్నర్సప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పడిలేస్తూ నాలుగోస్థానంలో నిలిచేందుకు తంటాలు పడుతోంది. మరో జట్టు ఓటమి చెందితేనే ప్లేఆఫ్‌ ఆడే స్థాయిలో ఉంది. ఇక రెండో క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లో మొదటి క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో ఎలిమినేషన్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఆడనుంది. ఆ మ్యాచ్‌కూ విశాఖే ఆతిధ్యమివ్వనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top