
కర్నూలు సిటీ: కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములుగౌడ్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియేట్ బోర్డు ప్రాంతీయ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలను కార్పొరేట్ యాజమాన్యాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు. ర్యాంకులు, మార్కుల కోసం విద్యార్థులను తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో ఇప్పటిæ వరకు 36 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వం యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
గతంలో ఫీజు కట్టని విద్యార్థిని యాజమాన్యం బయటకు పంపినా ఆ సంస్థ గుర్తింపును రద్దు చేశారని, ప్రస్తుతం విద్యార్థు«లు చనిపోతున్నా ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై నియమించిన నీరజారెడ్డి, చక్రపాణి కమిటీలు ఇచ్చిన నివేదికలు, సిఫారుసులను అమలు చేయించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న నారాయణ, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావులను తక్షణమే ప్రభుత్వం నుంచి వారిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఇంటర్ బోర్డు డీవీఈఓ సుబ్రమణ్యేశ్వరరావుకు వినతి పత్రం ఇచ్చారు. నాయుకులు ప్రతాప్, రమేష్, ధనుంజయ, వీరశేఖర్, మనోజ్ పాల్గొన్నారు.