 
															ఇంగ్లిష్‌పై మోజు
యూనివర్శల్ లాంగ్వేజ్‌గా ఉన్న ఇంగ్లిష్‌పై పట్టు సాధించేందుకు వయసుతో...
	* ఇంగ్లిష్ భాషపై అన్ని వర్గాల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి
	* తణుకు డిగ్రీ కళాశాలలో ‘బేసిక్స్ ఆఫ్ ఇంగ్లిష్’ శిక్షణకు విశేష స్పందన
	తణుకు టౌన్ : యూనివర్శల్ లాంగ్వేజ్‌గా ఉన్న ఇంగ్లిష్‌పై పట్టు సాధించేందుకు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. పదో తరగతి వరకు చదివిన గృహిణులతో పాటు ఎంబీఏ, ఇంజినీరింగ్ చదివి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, బీఈడీ విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఇంగ్లిష్ బేసిక్స్‌లో శిక్షణ పొందుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నారు. పట్టణంలోని ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఇంగ్లిష్‌లో బేసిక్స్‌పై ఇస్తున్న శిక్షణకు లభిస్తున్న స్పందనే దీనికి నిదర్శనం.
	
	కళాశాల ఇంగ్లిష్ అధ్యాపకుడు ఎ.రజనీకాంత్, ఇంగ్లిష్‌లో పరిశోధన చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శ్రీనివాసప్రసాద్‌ల సంయుక్త పర్యవేక్షణలో 40 రోజులకొక బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా సామాన్యులు కూడా ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సాధించాలన్నదే వీరి లక్ష్యం. 50 మందితో కూడిన తొలి బ్యాచ్‌కు శిక్షణ గురువారం ముగిసింది. ఈ నేపథ్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారు మాట్లాడుతూ ఇంగ్లిష్ మాట్లాడటం నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగిందని, భాషాపరమైన లోపాలు తొలగించుకుకున్నామని చెబుతున్నారు. ఇంగ్లిష్ భాషపై పట్టు సాధిం చేందుకు శిక్షణ తరగతులు దోహదం చేశాయని అంటున్నారు. కొందరు తమ మనోగతాన్ని ఇలా వెల్లడించారు.
	 
	స్పందన బాగుంది
	కళాశాలలో చదివే విద్యార్థులలో భాషా నైపుణ్యాలను పెంచేందుకు ఇంగ్లిష్‌లో బేసిక్స్ నేర్పుతున్నాం. అయితే అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. రెండేళ్లుగా బోధిస్తున్నాం. రెండో బ్యాచ్‌ను వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభిస్తాం.
	 - ఎ.రజనీకాంత్, కోర్సు కన్వీనర్,
	
	ఎస్సీఐఎం డిగ్రీ కళాశాల, తణుకు
	అన్నివర్గాలకు శిక్షణ ఇవ్వాలనేదే లక్ష్యం అన్ని వర్గాల ప్రజలకు ఇంగ్లిష్‌లో బేసిక్స్‌లో శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో దీనిని చేపట్టాం. ఇది విజయవంతం కావడంతో దీనికి అనుబంధ కోర్సులను త్వరలో ప్రవేశపెడతాం. హైదరాబద్‌లోని ప్రొఫెసర్లు ఆయా సబ్జెక్ట్‌లు బోదించేలా ప్రణాళికను తయారు చేస్తాం.
	 - డాక్టర్ ఎం శ్రీనివాసప్రసాద్, ప్రిన్సిపాల్, ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తణుకు
	 
	అమెరికాలో బంధువులతో మాట్లాడుతున్నా
	పదవ తరగతితోనే చదువు ఆపేశా. అమెరికాలో ఉన్న మా పిల్లల కోసం అక్కడికి వెళ్లా. అయితే బంధువులతో ఇంగ్లిష్ మాట్లాడలేక బిడియపడి మౌనంగా ఉండిపోయేదాన్ని. ఇపుడు ఇంగ్లిష్ నేర్చుకోవడంతో వారితో సులభంగా మాట్లాడగలుగుతున్నా.  
	 - డి.సుభద్రాదేవి, గృహిణి, తణుకు
	 
	పోటీ పరీక్షలకు వెళ్లేవారికి ఎంతో ఉపయోగం
	పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు బేసిక్స్ ఆఫ్ ఇంగ్లిష్ కోర్సులో శిక్షణ వల్ల ఎంతో ఉపయోగపడుతుంది. తరగతి గదిలో చదివిన ఇంగ్లిష్‌కు, పోటీ పరీక్షలలో ఇచ్చే ప్రశ్నలలో ఇంగ్లిష్‌కు చాలా తేడా ఉంటుంది. కోచింగ్ సెంటర్ల కంటే ఈ శిక్షణ  చాలా ఉపయోగకరం.
	 - ఐఆర్‌కే దీపక్, ఇంజినీరింగ్ పట్టభద్రుడు, తణుకు
	 
	తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగకరం
	తెలుగు మీడియంలో బీఈడీ చేసి ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారు ప్రస్తుతం ఇంగ్లిష్‌లో బోధన చేయాల్సి రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంగ్లిష్‌లో పాఠ్యప్రణాళికలు తయారు చేయడం కష్టంగా ఉండేది. ఇంగ్లీష్‌లో బేసిక్స్ తెలుసుకోవడంతో భాషపై పట్టు సాధించాను.
	 - జె.ఉమాదేవి, హైస్కూల్ ఉపాధ్యాయిని, తణుకు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
