పచ్చదండు.. కొత్త పుండు

Internal Fights in Nellore TDP - Sakshi

టీడీపీలో పదవుల లొల్లి

వలస వచ్చిన వారికే ప్రాధాన్యం

సీనియర్, జూనియర్ల మధ్య రగులుతున్న విభేదాల కార్చిచ్చు

భగ్గుమంటున్న నారాయణ, సోమిరెడ్డి వర్గాలు

అధిష్టానం తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీలో పదవుల లొల్లి తీవ్రరూపం దాల్చింది. నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సరి కొత్త వివాదం మొదలైంది. ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా అంతర్గతంగా సాగుతున్న వివాదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. పార్టీలో సీనియర్, జూనియర్‌ నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అగ్రతాంబూలం ఇస్తున్న పార్టీ పెద్దలు.. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికి మొండిచేయి చూపడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలన్నీ మంత్రులు నారాయణ వర్సెస్‌ సోమిరెడ్డిగా మారాయి. కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీతోపాటు నామినేటెడ్‌ పదవుల్లో కీలక ప్రాధాన్యత దక్కేలా మంత్రి నారాయణ చక్రం తిప్పుతుండటంపై సీనియర్లు ఫిర్యాదుల పరంపర మొదలుపెట్టారు.

అసంతృప్తి జ్వాల
ఇటీవల పార్టీ సీనియర్‌ నాయకులు కొందరు తమకు న్యాయం చేయాలని అధిష్టానాన్ని కోరడంతోపాటు జిల్లాలో కీలక మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణపై ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుదారులను మంత్రి నారాయణ పెద్దఎత్తున ప్రోత్సహిస్తూ చిన్నస్థాయి నామినేటెడ్‌ పదవులు మొదలుకొని పార్టీ పదవుల వరకు అన్నీ వారికే దక్కేలా చేస్తున్నారన్న విమర్శలు టీడీపీ శ్రేణుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సీనియర్లు కొందరు పార్టీ వేదికలపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 మాజీ మంత్రులు బల్లి దుర్గాప్రసాద్, తాళ్లపాక రమేష్‌ రెడ్డి నేతల తీరుపై పూర్తి అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉంటున్నారు. నామినేటెడ్‌ పదవి ఏదైనా కేటాయించాలని, కనీసం పార్టీ పదవైనా ఇవ్వాలని పలుమార్లు కోరినా అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఇద్దరూ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. మరో సీనియర్‌ నేత మండవ రామయ్య, కొంతకాలం క్రితం వరకు ఆత్మకూరు ఇన్‌చార్జ్‌గా ఉన్న కన్నబాబు, నగరం నుంచి పార్టీలో కీలక బీసీ నేతగా, కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న డాక్టర్‌ జెడ్‌.శివప్రసాద్, పార్టీ ఎస్సీ నేత ఎన్‌.శైలేంద్రబాబు నామినేటెడ్‌ పదవులు ఆశించి.. అమాత్యుల ద్వారా నామినేటెడ్‌ పదవుల కోసం ప్రయత్నాలు చేశారు. మంత్రులు న్యాయం  చేస్తామని చెప్పడం మినహా పట్టించుకున్న దాఖలాలు లేవు. 

ముఖ్యంగా జెడ్పీ చైర్మన్‌ పదవికి వేనాటి రామచంద్రారెడ్డి, నగర మేయర్‌ పదవికి పోటీపడిన డాక్టర్‌ జెడ్‌.శివప్రసాద్‌ రూ.కోట్లు ఖర్చుచేసినా ఓటమి పాలయ్యారు. నామి నేటెడ్‌ పదవులు ఇవ్వడం ద్వారా ఇద్దరికీ న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు, లోకేష్‌ హామీ ఇచ్చారు. అనంతరం వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అనుబంధ కమిటీల పదవులన్నీ భర్తీ అయ్యాయి. నామినేటెడ్‌కు సంబం ధించి కీలక పదవులన్నీ పూర్తయ్యాయి. మరికొన్ని నామినేటెడ్‌ పోస్టులు ఖరారై వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. వాటిలోనైనా తమకు చోటు కల్పించాలని నేతలు డిమాండ్‌ చేస్తుండగా.. వారి గోడు పట్టించుకునే పరిస్థితి అధిష్టానం వద్ద కనిపించడం లేదు.

ఫిరాయింపులపై మండిపాటు
ఇదిలావుంటే.. సీనియర్‌ నేతలంతా నారాయణ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. పెద్దఎత్తున పార్టీ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తూ సీనియర్‌ నాయకులకు అన్యాయం చేస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో మంత్రి నారాయణ నగరానికి చెందిన ఓ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకురాలు, మెప్మా పర్యవేక్షణ కమిటీ సభ్యురాలితోపాటు ఎమ్మెల్సీ పదవికి పోటీచేసి ఓడిన నేతను సీఎం వద్దకు తీసుకెళ్లి నామినేటెడ్‌ పదవి కేటాయించాలని కోరినట్లు సమాచారం. సీఎం స్పందించకపోగా.. అసహనం వ్యక్తం చేసి ఇప్పటికే చాలా మందికి ఇచ్చానని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.

 గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న చాట్ల నరసింహారావు, మంత్రి నారాయణ ద్వారా టీడీపీలో చేరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పదవి పొందారు. కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చిన ముప్పాళ్ల విజేత జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె నియామకంతో సీనియర్‌ మహిళా నేతలంతా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ మంత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన కార్పొరేటర్‌ ఆనం రంగమయూర్‌రెడ్డికి జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవిని ఖరారు చేశారు. ఇదికూడా సీనియర్లకు మింగుడు పడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్, జూనియర్ల వివాదం ముదిరి పాకానపడింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top