బతుకుదెరువు కోసం పరాయి దేశానికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఓ అభాగ్యుడు
రాజంపేట : బతుకుదెరువు కోసం పరాయి దేశానికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఓ అభాగ్యుడు. వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా రాజంపేట పట్టణానికి చెందిన షేక్ జాన్‌బాషా కుమారుడు కరీముల్లా(35) రెండు నెలల క్రితం కువైట్‌లోని ఓ షేక్ ఇంట్లో వంటపని చేసేందుకు వెళ్లాడు. ఇటీవల ఒక రోజు తాను పని చేస్తున్న షేక్ ఇంట్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత చూడగా బాత్‌రూంలో విగతజీవిగా పడి ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న కువైట్ పోలీసులు రంగంలోకి దిగి కరీముల్లాది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో విచారిస్తున్నారు. అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులు మాత్రం కరీముల్లాది ఆత్మహత్యగా కనిపించటం లేదని అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కాగా అతని మృతి విషయం రెండు రోజుల తర్వాత రాజంపేటలోని కుటుంబసభ్యులకు తెలిసింది. కరీముల్లా మృతదేహం శనివారం రాజంపేటకు చేరుకుంది.