ఆకాశమే హద్దుగా ‘అనంత’లో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతోంది. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, మహిళా జేఏసీలు కదం తొక్కుతున్నాయి.
అనంతపురం జిల్లా పరిషత్తు, న్యూస్‌లైన్ : ఆకాశమే హద్దుగా ‘అనంత’లో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతోంది. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, మహిళా జేఏసీలు కదం తొక్కుతున్నాయి. 44వ రోజు గురువారం కూడా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, విద్యా, ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తెరుచుకోలేదు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి ఉద్యోగ సంఘాలు సమాయత్తమయ్యాయి.
అందులో భాగంగా అనంతపురం జిల్లా పరిషత్ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు సమావేశమై ఈ నెల 14న ‘అనంత నారీ గర్జన’ నిర్వహించాలని నిర్ణయించారు. నగరంలోని తెలుగుతల్లి విగ్రహం నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. జెడ్పీ ఎదుట పంచాయితీ రాజ్ ఉద్యోగ సంఘాలు చేపట్టిన రిలే దీక్షలకు రాప్తాడు నుంచి వందలాది మంది ఉద్యోగులు పాదయాత్రగా వచ్చి సంఘీభావం తెలిపారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కుర్చీలకు అతుక్కుపోయారని జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు.. ఖాళీ కుర్చీల్లో మంత్రుల ఫొటోలు ఉంచి ప్రదర్శన నిర్వహించారు. ఎన్జీవో దీక్షా శిబిరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులు రిలే దీక్షకు కూర్చున్నారు.
న్యాయవాదులు, వైద్య ఆరోగ్య శాఖ జేఏసీ, విద్యుత్ ఉద్యోగులు, హౌసింగ్, వాణిజ్య పన్నుల శాఖ జేఏసీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాల జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పశు సంవర్ధక శాఖ జేఏసీ చైర్మన్ డాక్టర్ కె.జయకుమార్ నేతృత్వంలో ఉద్యోగులు గొడుగులు చేతపట్టుకుని నిరసన తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ, ప్రభుత్వ డ్రైవర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నేతల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ధర్మవరంలో జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతుండగా... ఆర్టీసీ, విద్యుత్తు కార్మిక సంఘాలు మానవహారం నిర్వహించారు. ముదిగుబ్బలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ, జేఏసీ, టీడీపీ, కాంగ్రెస్ నేతల రిలే దీక్షలు కొనసాగాయి. కుమ్మరి చేతి వృత్తుల వారు రోడ్డుపైనే కుండలు తయారు చేస్తూ నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పుట్టపర్తిలో రజకులు రోడ్డుపైనే దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేశారు. పామిడిలో సమైక్యవాదులు దీక్షలు కొనసాగిస్తూ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో ప్రైవేట్ పాఠశాలల అధ్యాపకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు పొర్లుదండాలతో నిరసన తెలిపారు. చిలమత్తూరులో ఉద్యోగ జేఏసీ నేతలు సమైక్యర్యాలీ నిర్వహించారు. లేపాక్షిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ చేశారు. కదిరిలో రిటైర్డ్ ఆర్‌టీసీ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు చేశారు.
న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యమే తమ అభిమతం అంటూ వేలాది మంది సమైక్యవాదులు గాండ్లపెంటలో గర్జించారు. కళ్యాణదుర్గంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీదివాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ బస్సును జేఏసీ నేతలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. సమైక్యవాదులు దీక్షలు కొనసాగిస్తూ మానవహారం ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోతే మన దుస్థితి ఇలా తయారవుతుందని మడకశిరలో జేఏసీ నేతలు చిప్పలు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు.
అమరాపురం, తలుపుల, గోరంట్ల, రొద్దం, సోమందేపల్లి, ఆత్మకూరు, పెద్దవడుగూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుకొండలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. గోరంట్లలో కమ్మ సంఘం ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో ఉద్యోగ సంఘాలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉద్యమంలో పాల్గొనాలనే డిమాండ్‌తో రాయదుర్గంలో బీజేపీ నాయకులకు చెందిన దుకాణాల వద్ద సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుల చేత ‘జై సమైక్యాంధ్ర’ అనిపించారు.
కణేకల్లులో ఎన్‌జీవోలు హెల్మెట్లు ధరించి ప్రదర్శన నిర్వహించారు. డి.హిరేహాళ్‌లో విభిన్న ప్రతిభావంతులు చేపట్టిన రిలేదీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామంలో సమైక్యాంధ్రకు మద్ధతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు రాప్తాడు నుంచి అనంత పురానికి పాదయాత్రగా వెళ్లారు. శింగనమలలో సమైక్యవాదులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం వినతిపత్రం సమర్పించారు. గార్లదిన్నె మండలం కల్లూరులో సమైక్యాంధ్రకు మద్ధతుగా జేఏసీ నేతలు ఆరమరణ దీక్షకు దిగారు. తాడిపత్రిలో మునిసిపల్, ఇంజనీరింగ్ విద్యార్థుల, వైద్య జేఏసీ నాయకులు రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. అబాకస్ విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు.
ఆర్టీసీ జేఏసీ నాయకులు శరీరానికి వేపమండలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. యాడికిలో చీరల వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. ఉరవకొండ జేఏసీ నేతలు కుటుంబ సభ్యులతో రిలే దీక్షలకు దిగారు. ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ జేఏసీ నేతలు ర్యాలీ నిర్వహించారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు మోకాళ్లపై నిల్చొని సమైక్య నినాదాలు చేశారు. పెనుకొండలో ఎమ్మెల్యే బీకే పార్థసారథిని న్యాయవాదులు అడ్డుకున్నారు. అనంతరం న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి సమీపంలోని రిలయన్‌స టవర్‌పెకైక్కి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు స్థానిక కోర్టులో పనిచే స్తున్న తెలంగాణలోని నల్గొండకు చెందిన గోపినాయక్ కూడా మద్దతు తెలిపారు.