గర్భిణులకూ గుర్తింపు సంఖ్య | Identity number for Pregnant womens Nationwide | Sakshi
Sakshi News home page

గర్భిణులకూ గుర్తింపు సంఖ్య

Sep 14 2013 12:46 AM | Updated on Sep 1 2017 10:41 PM

దేశవ్యాప్తంగా గర్భిణులకూ గుర్తింపు సంఖ్య ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని ఫోగ్సీ (ఫెడరేషన్ ఆఫ్ అబెస్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా-జాతీయ ప్రసూతి మరియు గర్భకోశవ్యాధుల వైద్యుల సమాఖ్య) పేర్కొంది.

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గర్భిణులకూ గుర్తింపు సంఖ్య ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని ఫోగ్సీ (ఫెడరేషన్ ఆఫ్ అబెస్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా-జాతీయ ప్రసూతి మరియు గర్భకోశవ్యాధుల వైద్యుల సమాఖ్య) పేర్కొంది. ఫిగో (అంతర్జాతీయ ప్రసూతి, గర్భకోశవ్యాధుల వైద్యుల సమాఖ్య) ప్రతినిధులతో కలిసి ఫోగ్సీ అధ్యక్షురాలు డాక్టర్ హేమ దివాకర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. దేశంలో సరాసరిన ప్రతి లక్షమంది గర్భిణుల్లో 212 మంది మృతి చెందుతున్నారని, ఇది అమెరికాలో 13గా ఉందని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్తనిల్వలు లేకపోవడం, శిక్షణ పొందిన వైద్యులు లేకపోవడం, రవాణా సౌకర్యాల లేమి తదితర కారణాల వల్ల మాతా మరణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.
 
 అందుకే ఫాగ్సి, ఫిగో సమాఖ్యల ఆధ్వర్యంలో ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కేంద్రానికి ఇచ్చామని, 2 నెలల్లో ఇది అమల్లోకి రానుందని చెప్పారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చిన గర్భిణులు, ఆశా కార్యకర్తలు గుర్తించిన గర్భిణులకు ఈ గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారని తెలిపారు. ఆ తర్వాత ఆ గర్భిణి ఏ ఆస్పత్రికి వెళ్లినా ఈ సంఖ్య ఆధారంగా ఆమెకు అందించిన వైద్య సేవల వివరాలు తెలుస్తాయని, ఎక్కడ పొరపాటు జరిగినా తెలిసిపోతుందని, దీనిద్వారా మాతా మరణాలను అరికట్టవచ్చునని ఆమె తెలిపారు.
 
 ఏపీలోనే ఎక్కువ మరణాలు: దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రసూతి మరణాలు చోటు చేసుకుంటున్నాయని హేమ దివాకర్ అన్నారు. ప్రతి లక్షమంది గర్భిణుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 144 మంది మృతి చెందుతున్నారని తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వైద్యుల ఆధ్వర్యంలో మరో రెండ్రోజుల పాటు గర్భిణుల్లో వచ్చే వివిధ సమస్యలపై చర్చ జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement