అదనపు కట్నం కోసం వేధించి.. భార్య హత్య | husband kills wife for extra dowry | Sakshi
Sakshi News home page

అదనపు కట్నం కోసం వేధించి.. భార్య హత్య

Nov 3 2013 9:32 PM | Updated on Mar 28 2018 10:56 AM

మద్యం కోరల్లో చిక్కుకొని అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తూ చివరకు ఉసురుతీసుకున్నాడు.

చెంచుపల్లి : జీవితాంతం కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని ఏడడుగులు నడిచి బాస చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడు అయ్యాడు. మద్యం కోరల్లో చిక్కుకొని అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తూ చివరకు ఉసురుతీసుకున్నాడు. ఈ సంఘటన పూడూరు మండలం ఎన్కెపల్లి అనుబంధ గ్రామం చెంచుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. చన్గొముల్ ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తీగలపల్లి శ్రీనివాస్ వికారాబాద్ పట్టణానికి సమీపంలోని కొత్తగడికి చెందిన లక్ష్మి(28)ని పన్నెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. దంపతులకు ముగ్గురు కుమారులు. అనారోగ్యంతో ఓ కొడుకు మృతిచెందాడు. శ్రీనివాస్ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన శ్రీనివాస్ పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. శనివారం రాత్రి 10 గంటలకు మద్యం తాగి ఇంటికి వచ్చిన ఆయన భార్య లక్ష్మితో గొడవపెట్టుకున్నాడు.
 
 తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన ఓ తాడుతో భార్య గొంతునులిమి చంపేశాడు. హత్య విషయం తెలిస్తే లక్ష్మి బంధువులు దాడి చేస్తారేమోనని భయంతో దూలానికి ఉరి వేశాడు. అనంతరం తన భార్య ఉరివేసుకుందని శ్రీనివాస్ స్థానికులకు చెప్పాడు. సర్పంచ్ దయాకర్ సమాచారంతో చన్గొముల్ ఎస్‌ఐ శ్రీనివాస్ ఆదివారం గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం చేవెళ్ల డీఎస్పీ శిల్పవల్లి చెంచుపల్లికి చేరుకొని లక్ష్మి మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబీకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే లక్ష్మిని హత్య చేసినట్లు శ్రీనివాస్ అంగీకరించాడు. కాగా తమ కుమార్తెను భర్త, బావ నారాయణ, తోడి కోడలు పెద్ద లక్ష్మి, ఆడపడుచు సరోజ కలిసి చంపేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వికారాబాద్ ఆస్పత్రిలో లక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలి అన్న అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement