హుద్‌హుద్ నష్టం రూ.3వేల కోట్లు | Hudhud damage of Rs 3 crore | Sakshi
Sakshi News home page

హుద్‌హుద్ నష్టం రూ.3వేల కోట్లు

Nov 27 2014 3:20 AM | Updated on Sep 2 2017 5:10 PM

అక్టోబర్ 12న విరుచుకుపడిన హుద్‌హుద్ తుపాను కారణంగా జిల్లాలో వివిధ శాఖలు, పబ్లిక్ ప్రాపర్టీకి రూ. 2995 కోట్ల నష్టం జరిగిందని

 విజయనగరం కంటోన్మెంట్: అక్టోబర్ 12న విరుచుకుపడిన హుద్‌హుద్ తుపాను కారణంగా జిల్లాలో వివిధ శాఖలు, పబ్లిక్ ప్రాపర్టీకి రూ. 2995 కోట్ల నష్టం జరిగిందని కలెక్టర్ ఎం.ఎం నాయక్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళినిలు వివరించారు. డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జిల్లా అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎం నాయక్ అధికారులతో కలసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నష్టం వివరాలను వివరించారు. గ్రామాల్లో సభలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టాలను నివేదించామన్నారు. తుపాను వల్ల 14 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 15,303 గృహాలు నష్టపోగా రూ.8.42 కోట్ల నష్టం వాటిల్లినట్టు వివరించారు.
 
 విద్యుత్ శాఖకు రూ.438 కోట్ల నష్టం జరిగిందనీ, వ్యవసాయ శాఖకు రూ.91 కోట్లు, ఉద్యాన వన శాఖకు రూ.11.83 కోట్లు, మత్స్య శాఖకు రూ.28.37 కోట్లు నష్టం వాటిల్లిందని వివరించారు. 685 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్‌లు దెబ్బతిన్నాయనీ, దీని వల్ల 91,656 ఎకరాల ఆయకట్టుకు నష్టం వాటిల్లిందన్నారు. 376 మధ్య తరహా ట్యాంక్‌లు దెబ్బతిన్నాయని తెలిపారు. దీని వల్ల రూ.59 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఆర్‌అండ్‌బీకి 20,890 లక్షల నష్టాన్ని అంచనా వేసినట్లు వివరించారు. పీఆర్, మున్సిపాలిటీలు, వైద్యం, ఫారెస్టు తదితర శాఖలకు తీవ్ర నష్టం జరిగిందని వివరించారు. ఈ నష్టాలను మండలాల వారీగా నివేదికలు అందజేయాలని అధికారులు సూచించారు. సమావేశంలో జేసీ బి.రామారావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, మున్సిపల్ చైర్మన్ ప్సాదుల రామకృష్ణ, జెడ్పీ ఉపాధ్యక్షుడు బలగం కృష్ణమూర్తి, ఏజేసీ నాగేశ్వరరావు, డీఆర్వో వై.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
 
 ‘తీరప్రాంతాల్లో గృహ నిర్మాణ యూని ట్లకు రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షలు’జిల్లాలో తీరప్రాంత మండలాల్లో గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి రూ.3.50 లక్షల రూపాయలందేలా యూనిట్ విలువ పెంచేందుకు ప్రతిపాదనలు చేశామని రాష్ట్ర గృహనిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. సమీక్ష అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రూ.4లక్షల వరకూ తీరప్రాంత మండలాల్లో తుపాన్లను తట్టుకునేలా ఇళ్లను నిర్మించే ఆలోచన ఉందని, సీఎం దీన్ని ఆమోదించాల్సి ఉందని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement