పోస్టర్‌ చూసి రాజమౌళి కామెంట్‌ చేశారు.. | Hero Sampoornesh Babu Exclusive Interview | Sakshi
Sakshi News home page

పోస్టర్‌ చూసి రాజమౌళి కామెంట్‌ చేశారు..

Nov 21 2017 10:42 AM | Updated on Nov 21 2017 10:47 AM

Hero Sampoornesh Babu Exclusive Interview - Sakshi - Sakshi - Sakshi

హృదయ కాలేయం.. పేరు నుంచి తీరు వరకు అందరినీ తన వైపునకు తిప్పుకున్న సినిమా. ‘మీ ప్రేమకు బానిసను’ అంటూ.. అందులో కథానాయకుడి పాత్ర పోషించి అంతే స్థాయిలో మెప్పించిన నటుడు సంపూర్ణేష్‌ బాబు. సినిమా వచ్చి ఇన్నేళ్లయినా సంపూ నటనను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. హాస్య నటుడే అయినా కథా నాయకుడి స్థాయిలో అలరిస్తూ అభిమానులను సంపాదించుకున్నారాయన. సినిమాల్లో కమెడియన్‌ వేషాలు వేస్తూనే సోలో హీరోగానూ సింగం 123, వైరస్, కొబ్బరి మట్ట వంటి చిత్రాలు చేస్తున్నారు. శ్రీకాకుళం వచ్చిన ఈ హాస్య నటుడు ‘సాక్షి’తో ఇలా ముచ్చటించాడు.

చదువుంటే హీరోనే
శ్రీకాకుళం రూరల్‌: చదువుకున్న ప్రతి ఒక్కరూ హీరోలేనని, తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని సినీ నటుడు సంపూర్ణేష్‌ బాబు అన్నారు. జిల్లా విశ్వ బ్రాహ్మణ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో సోమవారం పీఎన్‌ కాలనీలో గల సాయివిద్యామందిర్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. సిక్కోలు నుంచి ఎందరో ప్రముఖులు వచ్చారని, ఇక్కడి వారి ప్రేమాభిమానాలు ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. అనంతరం జిల్లా విశ్వబ్రాహ్మణ సంక్షేమం తరఫున సంపూర్ణేష్‌ బాబును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్ముణల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.వేణుగోపాలరావు, కోశాధికారి కె.బ్రహ్మజీ, యూత్‌ కోఆర్టినేటర్‌ జి.రమేష్, కె.వీరభద్రరావు, ఎం.హరనాథ్, సాయివిద్యామందిర్‌ కరస్పారెండెంట్‌ ఎస్‌.లక్ష్మి, ప్రిన్సిపాల్‌ బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 

బర్నింగ్‌ స్టార్‌.. ఈ పేరే విచిత్రంగా ఉంది. ఈ బిరుదు ఎలా వచ్చింది?
 హృదయ కాలేయం పోస్టర్‌ చూసిన డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి ట్విట్టర్‌లో కామెంట్‌ చేశారు. దీంతో ఆ సినిమా అందరి దృష్టిలో పడింది. ఆ సినిమాలో నా డైలాగ్‌ డెలివరీని చూసి బర్నింగ్‌ స్టార్‌ అని పెట్టారు. అభిమానులే దాన్ని కొనసాగిస్తున్నారు.

తెలంగాణకు చెందిన వారైనా సమైక్యాంధ్రకు అప్పట్లో ఎలా మద్దతు ఇచ్చారు?
 బేసిక్‌గా మాది తెలంగాణలోని సిద్ధిపేట గ్రామం. అప్పట్లో అందరం కలిసి ఉందామనే భావనతో నేనూ ఉద్యమంలో పాల్గొన్నాను.

మీకు బాగా పేరు తెచ్చిన సినిమాలు?
నా మొదటి చిత్రం హృదయ కాలేయంతో నేనేంటో ఇండస్ట్రీకి చూపిం చాను. తర్వాత సింగం 123 చేశాను. మూడో చిత్రంగా వైరస్,  ప్రస్తుతం కొబ్బరిమట్ట చిత్రంలో చేశాను. ఇది డిసెంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది.

కొబ్బరి మట్ట చిత్రం కథేంటి? అందులో ఏదైనా ప్రత్యేకత ఉందా?
ఈ చిత్రంలో మూడు పాత్రల్లో నటించాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్య చిత్రం ఇది. ఇందులో ఏకధాటిగా స్త్రీల కోసం రెండు నిమిషాల్లో ఒక డైలాగ్‌ చెప్పాను. అది ప్రేక్షకులను ఎంతగానో  ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. 

బిగ్‌బాస్‌ అనుభవాలేంటి? 
బిగ్‌బాస్‌ షోకి వెళ్లిన మూడు రోజులకే నాకు ఫోబియా వచ్చేసింది. చదవడానికి న్యూస్‌ పేపర్లు, చూడడానికి టీవీ, మాట్లాడడానికి మొబైల్‌ ఏవీ లేవు. ఒకవిధంగా బయట ప్రపంచంతో సంబంధమే లేదు. దీంతో నేను ఆ షోలో ఉండలేకపోయాను. తొమ్మిది రోజులకే షో నుంచి ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చేశాను. 

షార్ట్‌ఫిల్మ్‌లు ఎక్కువగా వస్తున్నాయి. వారిని ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయా? 
 టాలెంట్‌ ఉన్నవారికి కచ్చితంగా అవకాశాలు వస్తాయి. నిద్రపోతూ కలలు కంటే అవి నెరవేరవు. కలలు నెరవేరాలంటే మనం కష్టపడి పనిచేయాలి.

సేవా కార్యక్రమాల్లో మీరు ముందంజలో ఉంటారు. ఎలా ఫీలవుతున్నారు?  
ప్రతి ఒక్కరిలో సేవాభావం, మానవత్వం ఉండాలి. అందులో భాగంగానే నేను నాకు తోచిన సాయం చేస్తున్నారు. హుద్‌హుద్‌లో రూ.ఒక లక్ష ముఖ్యమంత్రికి అందించాను. చెన్నై వరదల సమయంలోనూ నా వంతు చేయూత అందించాను. ఇటీవల ఐరన్‌ లెగ్‌ శాస్త్రి కొడుక్కి బాగు లేదని నన్ను కలిశారు. వెంటనే కొంత ఆర్థిక సాయం చేశాను. 

నాటకాలు ఏమైనా చేసి ఉన్నారా?
సంపూ: ఎప్పటి నుంచో రంగస్థలం నాటకాలు చేయాలని ఉంది. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాను.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement