పవర్.. ఓవర్ | heavily increased power consumption in the city | Sakshi
Sakshi News home page

పవర్.. ఓవర్

Aug 24 2015 1:02 AM | Updated on Sep 18 2018 8:38 PM

పవర్.. ఓవర్ - Sakshi

పవర్.. ఓవర్

నగరంలో విద్యుత్ వాడకం రోజురోజుకూ రెట్టింపవుతోంది.

నగరంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
రికార్డు స్థాయిలో రోజుకు 4.4 మిలియన్ యూనిట్లుగా నమోదు
సీఎం క్యాంపు ఆఫీసులో నెలకు 10 వేల యూనిట్ల పైనే వాడకం.

 
విజయవాడ :  నగరంలో విద్యుత్ వాడకం రోజురోజుకూ రెట్టింపవుతోంది. విజయవాడ రాజధాని హోదా రావడంతో విద్యుత్‌కు డిమాండ్ బాగా పెరిగింది. నాలుగు నెలల క్రితం వరకు నగరంలో రోజుకు సగటున రెండు మిలియన్ యూనిట్ల వాడకం ఉండేది. ఇప్పుడది రెట్టింపు స్థాయి కూడా దాటింది. మండువేసవిలో మాత్రమే నెలకు నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్ వినయోగం రోజూ ఉండేది.  నెల రోజులుగా నగరంలో రోజుకు సగటున 4.4 మిలియన్ యూనిట్ల వాడకం జరుగుతోంది. ఎన్‌టీపీసీ నుంచి నిరంతర విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ కోత సమస్య ఉత్పన్నం కావడం లేదు.  మరో ఆరు నెలల్లోనే విద్యుత్ వాడకం రోజుకి 5 మిలియన్ యూనిట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు ఎక్కువ సబ్‌స్టేషన్ల నిర్మాణంపై దృష్టి సారించారు.

 అమాత్యులు, అధికారులు ఇక్కడే..
 ముఖ్యమంత్రి మొదలుకొని వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు  నెలలో ఎక్కువ రోజులు నగరంలోనే ఉంటున్నారు. ఇప్పటికే సూర్యారావుపేటలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటై కార్యకలాపాలు మొదలయ్యాయి. డీజీపీ క్యాంప్ ఆఫీసు కూడా ఇటీవలే ప్రారంభమైంది. మరో 20 రోజుల వ్యవధిలో సీఎస్ క్యాంపు కార్యాలయం, మరో నాలుగు వరకు ప్రధాన శాఖల కార్యాలయాలు ఏర్పాటుకానున్నాయి. అన్నిచోట్లా విద్యుత్ వినియోగం తప్పనిసరి. గత నెలలో సీఎం క్యాంపు కార్యాలయంలో 10,200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. విద్యుత్ శాఖ సుమారు రూ. 46 లక్షలతో అన్ని పనులు నిర్వహించింది. కీలక శాఖలు వస్తే నెలకు అదనంగా  50 వేల నుంచి 70 వేల యూనిట్ల వాడకం పెరుగుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే సులువుగా ఐదు మిలియన్ యూనిట్లు వినియోగం అవుతుంది. ఈ ఏడాది మే 26న డిస్కం చరిత్రలోనే అత్యధికంగా 4.434 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరిగింది. నగరంలో ఇప్పుడది సర్వసాధారణమైంది. నగరంలో సుమారు 2.30 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి 33 కేవీ, 11 కేవీ ఫీడర్ల ద్వారా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో విజయవాడ టౌన్ డివిజన్ పరిధిలో 3, గుణదల సబ్‌డివిజన్ కింద మూడు సబ్‌స్టేషన్‌ల పరిధిలో ఓవర్‌లోడ్ ఇబ్బందులు  కొంత కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి.  నగరంలో మరో ఐదు సబ్ స్టేషన్ల నిర్మాణంతో ఓవర్‌లోడ్ సమస్యను కొంత నివారించటానికి కసరత్తు సాగిస్తున్నారు.  మల్టీ స్టోరేజ్ భవనాల నిర్మాణం బాగా పెరగటం, మల్టీప్లెక్స్‌లు, మాల్స్ ఎక్కువగా రావడం, మూడు లక్షలకు పైగా ఏసీల వినియోగం ఉండటం కూడావిద్యుత్ అధిక వాడకానికి కారణాలుగా ఉన్నాయి. వచ్చే మార్చి నాటికి నగరంలో ఐదు మిలియన్ యూనిట్ల వాడకం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement