రాజధానిలోమలేరియా టెర్రర్‌! | Sakshi
Sakshi News home page

రాజధానిలోమలేరియా టెర్రర్‌!

Published Mon, Jul 22 2019 10:21 AM

Guntur District Stands At 3rd Position Among Highest Malaria Districts In AP - Sakshi

సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో ఓ మురికివాడలో దోమలన్నీ వానాకాలం సమావేశాలు నిర్వహించాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని దోమలు ముక్కు కదిలించుకుంటూ తరలివచ్చాయి. సమావేశానికి డెంగీ లక్ష్మి అధ్యక్షత వహించగా.. ఈ ఏడాది ముఖ్యఅతిథిగా మలేరియా రాణిని ఆహ్వానించాయి. కలెక్టర్లతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షలోనూ మలేరియా దోమ గురించే ప్రత్యేక ప్రస్తావన రావడంతో తనకు ఈ గౌరవం కట్టబెట్టాయి. ఈ సందర్భంగా మలేరియా రాణి మాట్లాడుతూ ‘గత ఐదేళ్లలో ప్రభుత్వం, అధికారుల సహకారంతో వందల మందిని మంచాన పడేశాం. ప్రతి ఏటా ఈ లక్ష్యాన్ని పెంచుకుంటూపోతున్నాం. ఈ ఏడాది కొత్త ప్రభుత్వమొచ్చాక మనపై దృష్టి సారించింది. ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయినా మనం వెనక్కి తగ్గకూడదు.

మురుగు కాలువలను పట్టించుకోని అధికారులు ఉన్నంత కాలం మన లక్ష్యానికి ఢోకా లేదు. ఎంతైనా గత పాలనలో పరిశుభ్రతపై దృష్టి సారించని మున్సిపల్‌ అధికారులకు మనందరం సన్మానం చేయాలి. కొత్త ప్రభుత్వంలోనూ అలాంటి అధికారులుంటే వారినీ ఇదే విధంగా సత్కరించాలి. మరింత మంది రక్తాన్ని తాగి.. వారి ప్రాణాలు తీయాలి. ఈ ఏడాదికిగాను ఈ లక్ష్యాలను నేను ప్రతిపాదిస్తున్నాను’ అని మలేరియా రాణి ప్రసంగం ముగించింది. దీనికి గున్యా వాణి ఆమోదం తెలుపగా మిగిలిన దోమలన్నీ మద్దతు పలికాయి. చివరిగా మలేరియా రాణిని ఆదర్శంగా తీసుకుని ఇక ప్రజలను కుట్టేద్దాం కదలండంటూ సమావేశాన్ని ముగించాయి. 

మలేరియా జ్వరం.. ఈ పేరు చెబితేనే గ్రామాల్లో చాలా మంది వణికిపోతారు. నెలల తరబడి జ్వరం పీడిస్తూ ఉండటమే కారణం. వ్యాధి సోకిందంటే ఒక పట్టాన త్వరగా శరీరాన్ని వదిలిపోదు. మలేరియా వ్యాధి సోకి అనేక మంది చనిపోతున్నారు. గతేడాది 420 మంది మలేరియా బారిన పడగా, ఈ ఏడాది జనవరి నుంచి జూలై 15 వరకు 103 మంది మలేరియా బారిన పడ్డారు. మలేరియా వ్యాధి సోకకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. అత్యధిక సంఖ్యలో తూర్పు గోదావరి జిల్లాలో మలేరియా కేసులు నమోదు అవ్వగా వైజాగ్‌ రెండో స్థానంలో, గుంటూరు జిల్లా మూడో స్థానంలో ఉంది.  

మలేరియా లక్షణాలు:
మలేరియా వ్యాధి అనాఫిలిస్‌ అనే దోమకాటు వల్ల వస్తోంది. ఈ వ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. చలి, వణుకుతో కూడిన విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, మూత్రం మందగించటం, లివర్, కడుపులో నొప్పి, జ్వరం మూడు రోజులకొకసారి లేదా రెండు రోజులకొక సారి లేదా రోజుమార్చి రోజు వస్తూ ఉండటం ఈ వ్యాధి లక్షణాలు.

నిర్ధారణ..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ గంట వ్యవధిలోపు చేస్తారు. రక్తపు పూతలు సేకరించి వ్యాధి నిర్ధారణ జరిగితే క్లోరోక్విన్, ప్రైమాక్సిన్‌ అనే మాత్రలను ఇస్తారు. ఇవి 14 రోజులు ఆపకుండా తప్పని సరిగా వాడాలి. ఈ మందులన్నీ కూడా ఉచితంగా అందిస్తారు. న్యూడ్రగ్‌పాలసీ 2012 ప్రకారం తప్పని సరిగా 14 రోజులు మందులు వాడాలి.

జిల్లాలో నమోదైన కేసులు..
జిల్లాలో మలేరియా జ్వరం  2014లో 428 మందికి, 2015లో 413 మందికి, 2016లో 369 మందికి, 2017లో 962 మందికి వచ్చింది. 2018లో 420 మందికి మలేరియా వచ్చింది.  2019లో  జనవరిలో 47 మంది, ఫిబ్రవరిలో నలుగురు, మార్చిలో ఒకరు, ఏప్రిల్‌లో ఐదుగురు, జూన్‌లో 21 మంది, జూలైలో 25 మంది మొత్తం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 103 మలేరియా వ్యాధి బారిన పడ్డారు. 

మలేరియా కేసులు నమోదైన ప్రాంతాలు..
గుంటూరు నగరంలోని ఆర్‌టీసీ కాలనీ, బాలాజీనగర్, ఆలీనగర్, అంబేడ్కర్‌నగర్, పాతగుంటూరు, లాలాపేట, నల్లచెరువు, ఏటి అగ్రహారం, ఆర్‌. అగ్రహారం. బ్రాడీపేట, శారదాకాలనీ, శ్రీనివాసరావుపేట, గుంటూరువారితోట, పొత్తూరివారితోట, తారకరామనగర్, శాంతినగర్, వాసవినగర్, సంగడిగుంట, కృష్ణబాబుకాలనీ, కంకరగుంట, అడవితెక్కళ్లపాడు, లింగాయపాలెం, మోపిరివారిపాలెం, నరసరావుపేట, బొల్లాపలి, వినుకొండలో మలేరియా కేసులనమోదు అయ్యాయి. 

కచ్చితమైన నిర్ధారణ చేయాలి

సరైన వ్యాధి నిర్ధారణ, చికిత్స చేయని పక్షంలో నెలల తరబడి మలేరియా వ్యాధి పీడిస్తోంది. కచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేయక  ఏళ్ల తరబడి ఎందరో అవస్థలు పడిన సంఘటనలు ఉన్నాయి. కొందరిలో సెరిబ్రల్‌ మలేరియా, వైవ్యాక్స్‌ మలేరియాలు కూడా వస్తాయి. ఈ వ్యాధులు సోకిన వారిలో ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవటం, కామెర్లు పెరిగిపోవటం, నిమోనియా, ఫిట్స్, మూత్రపిండాలు చెడిపోవటం, స్ప్రుహకోల్పోవటం  జరుగుతుంది. ఈ వ్యాధి మలేరియా ఉన్న వ్యక్తి రక్తం ఎక్కించటం ద్వారా, మలేరియా వ్యాధి ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ మనల్ని కుట్టటం ద్వారా  సోకుతోంది.
–డాక్టర్‌ నరేంద్ర వెంకటరమణ, ఫిజీషియన్‌

నివారణ చర్యలు తీసుకుంటున్నాం

మలేరియా నివారణ కోసం మే నెల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏప్రిల్‌లో మలేరియా నివారణ ప్రణాళిక సిద్ధం చేసి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. మలేరియా కేసులు నమోదైన గ్రామాల్లో మలాథిన్‌ఫాగింగ్‌ , పైరిత్రమ్‌ స్ప్రే, యాంటీలార్వా చర్యలు తీసుకున్నాం. మలేరియాను నోటిఫైడ్‌ డిసీజ్‌గా నిర్ధారణ చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులంతా తమ వద్దకు వచ్చిన వారికి మలేరియా వ్యాధి నిర్ధారణ చేసిన వెంటనే జిల్లా వైద్యాధికారులకు సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలి. మలేరియాను 2027 కల్లా నిర్మూలించాలనే లక్ష్యంతో వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి.    –డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి 

Advertisement

తప్పక చదవండి

Advertisement