మనసులో తెలంగాణ, సీట్లకోసం సమైక్యాంధ్ర | Sakshi
Sakshi News home page

మనసులో తెలంగాణ, సీట్లకోసం సమైక్యాంధ్ర

Published Sat, Jan 11 2014 2:31 AM

Gunda mallesh takes on Kiran kumar reddy

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ నేత గుండా మల్లేశ్ మధ్య శుక్రవారం శాసనసభలో ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. మల్లేశ్ మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి చదివింది, క్రికెట్ ఆడింది అంతా తెలంగాణలోనే.. ఇటీవల నేను ఆయన సహచరులను కలిసినప్పుడు వారు, కిరణ్‌కుమార్‌రెడ్డి మంచివారే.. అయితే ఎందుకు అలా (సమైక్యవాదిగా) మారారో అర్థం కావడంలేదు అని వాపోయారు. సీఎం అంటే నాకూ గౌరవం ఉంది. కాని విభేదించేదంతా తెలంగాణపైనే’ అని అన్నారు. దీనితో ముఖ్యమంత్రి.. ‘అయితే నేను తెలంగాణవాడినా? సీమాంధ్రవాసినా?’ అని ప్రశ్నించారు.
 
 మల్లేశ్ ప్రతిస్పందిస్తూ..‘మనసులో తెలంగాణ..ఓట్లు, సీట్ల కోసం సమైక్యాంధ్ర అంటున్నారు. మీకు తెలంగాణలో  పోటీ చేయడానికి సీటు ఇస్తాం.. తెలంగాణ అనండి’ అని అన్నారు. దీనితో ముఖ్యమంత్రి ‘ఓట్లు, సీట్ల కోసం రాజకీయం చేయడం లేదు. సమైక్యాంధ్ర నా నినాదం కాదు. విధానం. రాష్ట్ర విభజనతో ఇబ్బందులు వస్తాయి. తెలంగాణకు నష్టం జరుగుతుంది.  గతంలో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పాను, కాని ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నానో ఈ సభలో చెబుతాను’ అని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement