అనాథలైన అన్నాచెల్లెలు | Grand Father Suicide Brother And Sister Lonely Now In Chittoor | Sakshi
Sakshi News home page

అనాథలైన అన్నాచెల్లెలు

Aug 7 2018 11:05 AM | Updated on Nov 6 2018 8:08 PM

Grand Father Suicide Brother And Sister Lonely Now In Chittoor - Sakshi

జన్మనిచ్చిన తల్లి ఊహ తెలియకనే అనారో గ్యంతో చనిపోయింది. ఏడాదిన్నర క్రితం తండ్రి అనంత లోకాలకు వెళ్లిపోయాడు.కొండంత అండగా నిలిచిన తాతఅప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అన్నాచెల్లెళ్లు అనాథలుగా మారారు. కుటుంబాన్ని పోగొట్టుకున్న వారు ఇక మాకు దిక్కెవరంటూ చేస్తున్న రోదనలు అన్నీఇన్నీ కావు. వారిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు.

పెద్దతిప్పసముద్రం:  అప్పుల బాధ తాళలేక మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ నవాబుకోటకు చెందిన గుమ్మసముద్రం గంగులప్ప ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయనకు సోమవారం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అంతిమ సం స్కారాలు చేశారు. తుమ్మరకుంట పంచాయతీ నవాబు కోటకు చెందిన గంగులప్ప, సుబ్బమ్మ దంపతులకు సుబ్బరాయప్ప, శ్రీరాములు కొడుకులు. చిన్న కుమారుడు సుబ్బరాయప్ప, కోడలు ఈశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఎనిమిదేళ్ల వ్యవధిలో ఇద్దరూ మృతి చెందారు. దీంతో వారి పిల్లలు మీనా, అనీల్‌ అనాథలుగా మిగిలారు. వారి పోషణ భారం గంగులప్ప మీద పడింది.

తనకున్న మూడెకరాల పొలంలో ప్రభుత్వం ఉమ్మడి రైతులకు వేసిన బోరు ద్వారా టమాట పంట సాగు చేస్తూ భార్య, మనవడు, మనవరాలిని పోషించుకుంటున్నాడు. రెండేళ్లుగా వరుసగా టమాట పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. కుటుంబ పోషణ భారంగా మారింది. మనవరాలికి పెళ్లి ఎలా చేయాలో తెలియలేదు. దీనికితోడు పంట సాగు కోసం చేసిన రూ.1.10 లక్షల అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక జీవితంపై విరక్తి చెంది ఆదివారం వేకువజామున వ్యవసాయ పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు లేకపోయినా కొండంత అండగా నిలిచిన తాత హఠాన్మరణంతో ఆ ఇద్దరు పిల్లల ఆవేదన అంతా ఇంతా కాదు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఇంక మాకు దిక్కెవరని వారు చేస్తున్న రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు.

చేతులు చాచి దహన సంస్కారాలు చేశాం
మాకు అమ్మా నాన్న లేకపోయినా అవ్వా, తాత మంచి చెడ్డా చూశారు. మా తాత ఆత్మహత్య చేసుకుని మాకు దూరం అయ్యాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దాతల సహకారంతో అంతిమ సంస్కారాలు చేశాం.       –మీనా

ఏం చేయాలో దిక్కు తోచడం లేదు
చిన్నప్పుడే అమ్మ, ఇంటర్‌ చదివేటప్పుడు నాన్న చనిపోయాడు. చదువును ఆపేసి పొలం పనుల్లో తాతకు చేదో డు వాదోడుగా ఉంటున్నా. మా తాత చనిపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. చెల్లెలు పెళ్లీడుకు వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలి.                   – అనీల్‌

పూరి గుడిసెలో తల దాచుకుంటున్నాం
ఇన్నాళ్లు పూరి గుడిసెలోనే తల దాచుకుంటున్నాం. చిన్న కొడుకుకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. వానొస్తే అది కూడా కారుతుంది. వైకుంఠ సమారాధన చేయాలన్నా చేతిలో చిల్లి గవ్వ లేదు. గవర్నమెంటోళ్లు మమ్మల్ని ఆదుకోవాలి.    –సుబ్బమ్మ, రైతు భార్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement