వెయ్యి కోసం ఎన్ని కష్టాలో

 The Government Has Reduced The Welfare Of Farmers And Poured Fertilizers For The Votes - Sakshi

సాక్షి, పెద్దారవీడు: ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ ప్రభుత్వానికి రైతులపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. నాలుగున్నరేళ్లుగా రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం ఓట్ల కోసం ఒక్క సారిగా వరాల జల్లు కురిపించింది. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి  ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మన్‌ నిధి పథకం ద్వారా రూ. 6 వేలు ప్రకటిస్తే దాన్ని తప్పుదోవ పట్టించిన చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించింది. కేంద్రం కంటే తామే ఎక్కువ రైతుల కష్టాలు తీరుస్తాన్నామంటూ ప్రకటించుకుంటోంది. రుణమాఫీ అంశాన్ని పూర్తిగా పక్కదారి పట్టించడానికి చంద్రబాబు ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన అన్నదాతా సుఖీభవ పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేశారని రైతులు వాపోతున్నారు.

కార్యాలయం చుట్టూ రైతుల ప్రదక్షిణలు  
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఈ పథకానికి 19 పంచాయతీలలో 7,153 మంది రైతులను అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇందులో ఇప్పటికీ రూ. 1,000 జమకాని రైతులు మండలంలో 950 మంది రైతులు ఉన్నారు. అర్హులైన రైతులకు ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 15 వేలు చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం సుఖీభవ పథకం ద్వారా రూ. 1,000, కేంద్ర ప్రభుత్వం రూ. 2 వేలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. ప్రస్తుతం అందిస్తున్న రూ. 1,000 చాలా మందికి రైతుల ఖాతాలో పడని పరిస్థితి.

ఈ పరిస్థితి ఎక్కువగా బ్యాంకు అకౌంట్‌కు, రేషన్‌కార్డుకు, ఆధార్‌కార్డుకు అనుసంధానం కాని రైతుల ఖాతాలకు నగదు జమ కావడంలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నగదు జమ కాని రైతులు వ్యవసాయ, రెవెన్యూ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయ పనులు మానుకొని కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. దీని కన్నా గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా సంపూర్ణ రుణమాఫీ చేసి ఉంటే తమకు రుణ బాధలు తప్పేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అర్హులందరికీ న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

ఒక్క రూపాయి జమ కాలేదు  
అన్నదాతా సుఖీభావ పథకం ప్రభుత్వం ప్రకటించింది. ఇంత వరకూ బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయి కూడా పడలేదు. అధికారులను అడిగితే భూమికి సంబంధించిన ఆన్‌లైన్, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జీరాక్స్‌ కాగితాలు ఇస్తే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామన్నారు. త్వరలో నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. 
– శిరసాని కాశిరెడ్డి, రైతు, రేగుమానిపల్లె గ్రామం

తప్పులు సరి చేస్తున్నాం  
రైతులకు సంబంధించి ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సరిగా లేకపోవడంతో మండల వ్యాప్తంగా 950 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు జమకాలేదు. ఇందులో 390 మంది రైతుల వివరాలు సరిచేసి అప్‌లోడ్‌ చేశాం. ఇంకా 560 మంది రైతుల వివరాలు సరిచేయాలి. మిగత రైతులు కూడా త్వరగా వచ్చి అప్‌లోడ్‌ చేసుకోవాలని సంబంధిత ఎంపీఈఓలకు గ్రామాల్లో రైతులకు తెలియజేయాలని చెప్పాం. అప్‌లోడ్‌ చేసిన వారానికి నగదు జమ అవుతుంది.
 –బుజ్జీబాయి, ఇన్‌చార్జి వ్యవసాయాధికారి, పెద్దారవీడు 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top