ప్రభుత్వం నుంచి భూమి తీసుకుని ఒప్పం దం మేరకు ఉపాధి కల్పించని, పెట్టుబడి పెట్టని, నిర్మాణాలు చేపట్టని ఐటీ సంస్థలపై ఐటీ శాఖ కొరడా ఝుళిపించింది.
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నుంచి భూమి తీసుకుని ఒప్పం దం మేరకు ఉపాధి కల్పించని, పెట్టుబడి పెట్టని, నిర్మాణాలు చేపట్టని ఐటీ సంస్థలపై ఐటీ శాఖ కొరడా ఝుళిపించింది. నిర్ణీత లక్ష్యంలో 30 శాతం అంతకంటే తక్కువ మందికి ఉపాధి కల్పించిన ఐటీ సంస్థల నుంచి భూములను వెనక్కి తీసుకోనుంది. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ), హెచ్‌ఎండీఏల నుంచి భూమి తీసుకున్న సంస్థలకు మాత్రమే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. నేరుగా భూమిని కొనుగోలు చేసిన సంస్థలకు ఈ నిబంధనలు వర్తించవని తెలిపారు.
ఇవీ మార్గదర్శకాలు..
ఒప్పందం మేరకు పెట్టుబడి పెట్టని, నిర్మాణాలు చేపట్టని, 30 శాతం, అంతకంటే తక్కువ మందికి ఉపాధి కల్పించిన సంస్థలకు కేటాయించిన భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఉపాధి 31 నుంచి 80 శాతం మధ్య ఉంటే.. ప్రస్తుత భూమి విలువలో 10 శాతాన్ని ప్రాసెసింగ్ చార్జీ కింద, దరఖాస్తు కోసం రూ. 10 వేలు చెల్లించాలి. ఏపీఐఐసీతో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. 81-100 శాతం ఉపాధి కల్పిస్తే ప్రస్తుత భూమి విలువలో 5 శాతం ప్రాసెసింగ్ చార్జీ కింద చెల్లించడంతో పాటు దరఖాస్తుకు రూ.10 వేలు చెల్లించాలి. ఏపీఐఐసీతో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. 100 % ఉపాధి సాధించిన సంస్థలకు ఇచ్చిన సేల్ డీడ్‌ను ఐటీ కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.