ఓటు అంటేనే భయం.. భయం.. | Gottipadiya Villagers Can’t Be Vote Freely | Sakshi
Sakshi News home page

ఓటు అంటేనే భయం.. భయం..

Published Sat, Apr 6 2019 10:09 AM | Last Updated on Sat, Apr 6 2019 10:09 AM

Gottipadiya Villagers Can’t Be Vote Freely - Sakshi

వినతిపత్రం ఇచ్చేందుకు మార్కాపురం వచ్చిన గొట్టిపడియ, అక్కచెరువు గ్రామస్తులు

సాక్షి, మార్కాపురం (ప్రకాశం): పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్‌ కమిషన్, అధికార యంత్రాంగం, పోలీసు బందోబస్తు, అత్యాధునిక టెక్నాలజీ, మీడియా వంటివన్నీ ఉన్నాగానీ, ఓ చిన్న గ్రామంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు భయపడుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలతో కొన్నేళ్లుగా ఇష్ట్రపకారం ఓటు వేయలేకపోతున్నారు. బెదిరింపులకు భయపడి ఇష్టంలేని వ్యక్తులకు ఓటేస్తున్నారు. మార్కాపురం మండలంలోని గొట్టిపడియ పంచాయతీలో నెలకొన్న ఈ పరిస్థితి ఎన్నికల కమిషన్, అధికారులు, పోలీసుల పనితీరుకు సవాల్‌ విసురుతోంది.

చిన్నపాటి గ్రామమైన గొట్టిపడియలో 1,541 ఓట్లు ఉన్నాయి. పోలీసు రికార్డుల్లో ఫ్యాక్షన్‌ విలేజ్‌గా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉంది. ఆ గ్రామంలో కొన్నేళ్లుగా వర్గపోరు జరుగుతోంది. ఎన్నికలు వస్తే ఒక వర్గానికి చెందిన ప్రజలు భయం, ఆందోళనకు గురవుతుంటారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వేసుకోలేని పరిస్థితి. అధికార పార్టీకి చెందిన ఒక వర్గం నాయకులు గత ఎన్నికల్లో కొంతమంది దళితులు, మరికొంతమంది బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. పోలింగ్‌ కేంద్రంలో ఎవరికి ఓటు వేసేది తమకు చూపించాలని బెదిరించారు. దీంతో కొంత మంది గ్రామస్తులు ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో తామంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల కమిషన్‌తో పాటు మార్కాపురం ఆర్డీఓ, డీఎస్పీకి వినతిపత్రాలు పంపారు.

టీడీపీ నేతలు తమను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, చర్చికి వచ్చి బైబిల్‌ పట్టుకుని తాము చెప్పినట్లుగా ఓటు వేస్తామని ప్రమాణం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పలువురు దళితులు ఆరోపిస్తున్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని 85, 86 పోలింగ్‌ బూత్‌లు గొట్టిపడియ పంచాయతీలోకి వస్తాయి. ఈ గ్రామంలో గొట్టిపడియతో పాటు అక్కచెరువు తండా ఉంది. పోలింగ్‌బూత్‌ 85లో 783, 86లో 755 ఓట్లు ఉన్నాయి. ఇటీవల మరో 25 ఓట్లు అదనంగా చేరాయి. ఆ వివరాలను ఓటర్ల జాబితాలో ప్రచురించాల్సి ఉంది.

20 ఏళ్లుగా స్వేచ్ఛ లేదు...
గొట్టిపడియలోని బూత్‌ నంబర్‌ 85, 86లో ఓటింగ్‌ ప్రక్రియ స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన తుమ్మా వెంకటరెడ్డి, గాలెయ్య, సుబ్బారెడ్డి, పుప్పాల దావీదు, నాగూర్, ఏసు, వెంకటేశ్వరరెడ్డి, కాశయ్య, రాజారావుతో పాటు మొత్తం 42 మంది గ్రామస్తులు సంతకాలు చేసి కలెక్టర్, ఈసీకి పంపారు. గత 20 ఏళ్ల నుంచి తామంతా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలను, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని టీడీపీకి చెందిన బూత్‌ ఏజెంట్లే తమ ఓట్లు వేస్తున్నారన్నారు. అదేంటని ప్రశ్నిస్తే మా ఇష్టమని బెదిరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు.

మిగిలిన వారు కూడా ఎవరికి ఓటు వేసేది పోలింగ్‌ కేంద్రంలో కూర్చున్న అధికారపార్టీ ఏజెంట్లకు చూపించి వేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒకవేళ వారు చెప్పినట్లు కాకుండా వేరే పార్టీ వారికి ఓటు వేసి బయటకు వస్తే తమపై దాడులకు దిగుతున్నారని తెలిపారు. అప్పట్లో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోలేదన్నారు. వివాదాస్పద బూత్‌ ఏజెంట్లను నియమించవద్దని కోరారు. పోలింగ్‌ కేంద్రానికి ఆనుకుని టీడీపీ కార్యాలయం ఉందని, పోలింగ్‌ జరిగే రోజు అక్కడ ఆ పార్టీ కార్యకర్తలు ఉండకుండా 100 మీటర్ల దూరం వరకూ నిలువరించాలని గ్రామస్తులు రాసిన లేఖలో కోరారు. ఓటింగ్‌ ప్రక్రియను సీసీ కెమేరాలతో రికార్డు చేయాలని, వెబ్‌ కాస్టింగ్‌ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
గొట్టిపడియ, అక్కచెరువు తండాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్నా.. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలన్నా ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. లేదంటే అధికారపార్టీ నేతలు చెప్పినట్లుగా మేము ఓటు వేయాల్సిందే. మాకు అదనంగా రక్షణ కల్పించాలి. 
– మేఘావత్‌ రాములు నాయక్, అక్కచెరువుతండా 

అదనపు పోలీసులను నియమించాలి
85, 86 పోలింగ్‌ బూత్‌లలో ప్రశాంతంగా ఓటు వేసుకునే పరిస్థితి ఉండాలంటే అదనంగా పోలీసులను నియమించాలి. లేదంటే గత ఎన్నికల్లోలాగే మేము భయంతో ఇష్టంలేని వారికే ఓటు వేయాల్సి వస్తుంది. ఈసారి అటువంటి పరిస్థితి మాకు వద్దు. మా ఇష్టం వచ్చిన వారికి మేము ఓటు వేసుకోవాలి. 
– ఎం.బాలునాయక్, అక్కచెరువుతండా

బెదిరింపులు ఆపాలి
ఎన్నికలంటే మా గ్రామంలో భయానక వాతావరణం నెలకొంటుంది. మా ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసుకోలేని పరిస్థితి మాది. దీనికి వ్యతిరేకంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ నేతల బెదిరింపులు లేకుండా చూడాలి. గ్రామస్తులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి మాలో ధైర్యం నింపాలి. 
– కుందురు నడిపి కొండారెడ్డి, గొట్టిపడియ

ప్రశాంతంగా ఓటు వేసుకోనివ్వాలి
మా గ్రామంలో మమ్మల్ని ప్రశాంతంగా ఓటు వేసుకోనిచ్చే పరిస్థితి కల్పించాలి. గ్రామంలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు, బెదిరింపులకు ఓటర్లు భయపడుతున్నారు. స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం కల్పించాలి.
– తుమ్మా వెంకటరెడ్డి, గొట్టిపడియ

1
1/1

గొట్టిపడియ గ్రామస్తులు కలెక్టర్‌కు పంపిన వినతిపత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement