రాష్ట్రాన్ని అన్యాయంగా అక్రమంగా విడగొట్టినప్పుడు సహకరించిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైనందుకు సిగ్గుపడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ధ్వజం
మంగళగిరి : రాష్ట్రాన్ని అన్యాయంగా అక్రమంగా విడగొట్టినప్పుడు సహకరించిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైనందుకు సిగ్గుపడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు ఇస్తామంటే పదేళ్లు కావాలని రాజ్యసభలో పట్టుపట్టిన వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేస్తుంటే మౌనంగా ఉండడం ఏమిటని ఆర్కే ప్రశ్నించారు. తమ పార్టీ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లిప్రత్యేక హోదా కోసం ప్రధాని,రాష్ట్రపతితో పాటు కేంద్రమంత్రులను కలసి వినతిపత్రాలు అందజేసి పోరాడారని ఈ సందర్భంగా ఆర్కే గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎన్నికల హామీలు నెరవేర్చలేక రాజధాని నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని విదేశాలు తిరుగుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు వెంకయ్యనాయుడుతో పాటు చంద్రబాబు మొద్దునిద్ర నటిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరగడం మాని ఢిల్లీ తిరిగి ప్రత్యేక హోదా సాధించాలనీ, రైతుల భూములు లాక్కుని విదేశాలకు అప్పగించి లబ్ధి పొందాలనే ఆలోచనలు మానుకోవాలని సూచన చేశారు.
అలాగే రాష్ర్ట ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వెంకయ్య నాయుడు, చంద్రబాబు ఇరువురు రాష్ట్రప్రజలను అబద్దాలతో మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందన్నారు.