అన్న క్యాంటీన్లపై రభస

General Body Meeting Anna Canteens - Sakshi

వాదోపవాదాల మధ్య నగరపాలక సర్వసభ్య సమావేశం

ఎల్‌ఈడీ దీపాల నిర్వహణపై సభ్యుల అసంతృప్తి

రోడ్ల విస్తరణ, బుగ్గవంక సుందరీకరణపై సమగ్ర చర్చ       

సాక్షి, కడప కార్పొరేషన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లకు సంబంధించి పాలకవర్గ సభ్యులకు తెలియకుండానే కార్పొరేషన్‌ కార్యాలయంలో స్థల కేటాయింపు జరపడంపై రభస చెలరేగింది. మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ హాలులో మేయర్‌ సురేష్‌బాబు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 47వ డివిజన్‌ కార్పొరేటర్‌ పాకా సురేష్‌ ఈ అంశాన్ని లేవనెత్తుతూ కార్పొరేషన్‌ సాధారణ నిధుల నుంచి జన్మభూమి, నవనిర్మాణ దీక్షలకు ఖర్చు చేస్తున్నారని, అన్నక్యాంటీన్‌కు కార్పొరేషన్‌ స్థలాన్ని ఇస్తూ పాలకవర్గ సభ్యులకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. దీనికి కమిషనర్‌ లవన్న స్పందిస్తూ ప్రభుత్వం అత్యవసరంగా చేయాలని చెప్ప డం వల్లే చేశామని, ఆ స్థలం ఎవరికీ ఇవ్వలేదని, కార్పొరేషన్‌ ఆధీనంలో నే ఉందని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచి పనిని తప్పుబట్టడం సరికాదని టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ విశ్వనాథరెడ్డి సూచించగా, తప్పుబట్టడం లేదని సభ్యులకు సమాచారం ఇవ్వలేదనే అడిగామని పాకా సురేష్‌ వివరణ ఇచ్చారు. ఈ దశలో కో–ఆప్షన్‌ సభ్యుడు ఎంపీ సురేష్‌ అన్న క్యాంటీన్ల పనులన్నీ వైఎస్‌ఆర్‌సీపీ వారే చేస్తున్నారని అనడంతో ఆ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీవు కో–ఆప్షన్‌ సభ్యుడివి ఎలా అయ్యావు’ అనడంతో టీడీపీ సభ్యుడు విశ్వనాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా సభలో గందరగోళం చెలరేగింది. మేయర్‌ జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. 

వీఎల్‌టీ ఫీజుల వసూలుపై ఆగ్రహం
కార్పొరేషన్‌లో వీఎల్‌టీ పేరుతో 14 శాతం ఫీజు లు వసూలు చేయడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకవర్గానికి తెలియకుండా ప్రజలపై భారం వేసి చెడ్డపేరు తెస్తున్నారని బండిప్రసాద్, పాకా సురేష్, లక్ష్మయ్య మండిపడ్డారు. నగరపాలక సంస్థకు చెందిన స్థలాల వివరాలను అసెస్‌మెంట్‌ రిజిస్టర్‌లో పొందుపరచాలని సభ్యులు సూచించగా మేయర్‌ అంగీకరించారు. రోడ్ల విస్తరణ, బుగ్గవంక సుందరీకరణ, ట్రాఫిక్‌ అంశాలపై సమగ్ర చర్చ జరిగింది.

ఎల్‌ఈడీ దీపాల నిర్వహణపై ఏది నిజం
ఎల్‌ఈడీ దీపాల కోసం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చామని చెబుతోంది, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వమూ  ఇచ్చామని చెబుతోంది, ఇందులో ఏది నిజమని పాకా సురేష్, మగ్బూల్‌ బాషా ప్రశ్నించారు. అన్ని నిధులు కార్పొరేషన్‌ జనరల్‌ ఫండ్‌లోంచి ఇవ్వాలని తీర్మాణం ప్రవేశపెట్టారు, అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్‌ఈడీ దీపాలకు నిధులేమీ ఇవ్వలేదా అని సూటిగా ప్రశ్నించా రు. అగ్రిమెంట్‌ చేసేటప్పుడు సభ్యులకు తెలపకుండా బిల్లులు చెల్లించాల్సి వచ్చేసరికి తీర్మాణం పెట్టడం సరికాదన్నారు. సంవత్సరం నుంచి అడుగుతున్నా తమ డివిజన్‌లో వీధిదీపాలు వేయలేదని సభ్యులు లక్ష్మయ్య, ఎంఎల్‌ఎన్‌ సురేష్‌ సభ దృష్టికి తెచ్చారు. దీనిపై మేయర్‌ స్పందిస్తూ కార్పొరేటర్ల కమిటీ దీనిపై అధ్యయనం చేసి నిధుల విడుదలపై స్పష్టత ఇస్తుందని ప్రకటించా రు. కార్పొరేషన్‌లో ఒక్కొక్కరి వద్ద రూ.2లక్షలు తీసుకుంటూ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులుగా నియమిస్తున్నారని, ఇలా 29 మందిని నియమించారని పాకా సురేష్‌ ఆరోపించారు. వీరిని ఎవరి అనుమతితో తీసుకున్నారో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. దీనిపై మేయర్‌ స్పందిస్తూ 4 రోజు ల్లో నివేదిక ఇవ్వాలని కమీషనర్‌ను ఆదేశించారు. 

అమృత్‌ పథకానికీ మొండిచెయ్యేనా!
అమృత్‌ పథకానికి  రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని సభ్యుడు పాకా సురేష్‌ విమర్శించారు. అమృత్‌ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 20 శాతం భరించకపోవడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్‌ బి.అరీఫుల్లా మాట్లాడుతూ మాచుపల్లె బస్టాండును చెత్తను తొలగించి ఆధునీకరించాలని కోరారు. మేయర్, ఎమ్మెల్యే కూ డా ఆ ప్రతిపాదనకు మద్దతు పలి కారు. కార్పొరేషన్‌ జనరల్‌ ఫండ్‌ను తమ డివిజన్లలో ఖర్చు పెట్టకుం డా అన్యాయం చేశారని ఎస్‌ఏ షంషీర్, జమ్మిరెడ్డి, హరూన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో జనరల్‌ ఫండ్‌ ఏఏ డివిజన్లలో ఎంత ఖర్చు చేశారో జాబితా రూపొందించి, ఖర్చుపెట్టని డివి జన్లకు ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరారు. అంతకుముందు ఇటీవల మృతి చెందిన 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ జేసీబీ పీటర్స్‌ మృతికి సంతాపంగా సభ రెండు నిముషాలు మౌనం పాటించింది. ఎస్‌ఈ ఉమామహేశ్వరరావు, అదనపు కమీషనర్‌ నిరంజన్‌రెడ్డి, డిప్యూటీ కమీషనర్‌ సుశీలమ్మ, ఈఈ కేఎం దౌలా, ఇరిగేషన్‌ ఈఈ కొండారెడ్డి  పాల్గొన్నారు.

పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు– మేయర్‌
నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందు కు చర్యలు చేపడుతున్నట్లు మేయర్‌ సురేష్‌బాబు తెలిపారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య రాకుండా గట్టెక్కామని, ఎల్‌ఈడీ వ్యవస్థ సక్రమంగా లేదన్నారు. ఉక్కాయపల్లె కంపోస్టు యార్డులో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న పనులను పాలకవర్గ సభ్యులతో కలిసి తనిఖీ చేస్తామని చెప్పారు. 

వారిపై కేసు నమోదు చేయాలి–ఎమ్మెల్యే 
కార్పొరేషన్‌కు సంబంధించిన గదిని అనధికారికంగా లీజుకు ఇచ్చి బాడుగ వసూలు చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని  ఎమ్మెల్యే అంజద్‌బాషా డిమాండ్‌ చేశారు. రూ.1000లు పింఛన్‌ డబ్బు దుర్వినియోగం అయ్యిందని ఉద్యోగులను సస్పెండ్‌ చేశారని, అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. 29వ డివిజన్‌లో మేస్త్రిని మార్చడంపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రజలు అంధకారంలో ఉన్నా, కాలువలు లేక దుర్వాసన చచ్చిపోతున్నా జనరల్‌ ఫండ్‌ లేదని చెప్పే అధికారులు అన్నక్యాంటీన్లు, నవనిర్మాణ దీక్షలకు ఎలా ఖర్చుపెడుతున్నారని ప్రశ్నించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top