
సింగపూర్, మలేషియా, దుబాయ్.. బాబుకు మూడు కళ్లు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. సీమాంధ్రను సింగపూర్ మాదిరి తయారు చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని, సింగపూర్‌కు మీకు ఏమిటీ సంబంధమేంటని రామచంద్రరావు ప్రశ్నించారు.
చంద్రబాబుకు సింగపూర్, మలేషియా, దుబాయ్ మూడు కళ్లులాంటివని వ్యాఖ్యానించారు. సింగపూర్‌లో ఉన్న మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు గట్టు సవాల్ విసిరారు. 'ఎన్నికల సర్వేలను మేనేజ్ చేయడంలో మీకు మీరే సాటి. 2004, 2009 ఎన్నికల సందర్బంగా మళ్లీ మీకే పగ్గాలంటూ ఎల్లో మీడియాలో కథనాలు రాయించుకున్నది వాస్తవం కాదా? సర్వేలను మేనేజ్ చేయగలరేమో గాని, ప్రజలను మేనేజ్ చేయడం అసాధ్యం' అంటూ చంద్రబాబును ఉద్దేశించి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యలు చేశారు.