గ్యాంగ్ వార్!

గ్యాంగ్ వార్! - Sakshi


భూ వివాదాలు, దందాలకు పాల్పడుతున్న రౌడీ ముఠాలు

జైలు నుంచే సెటిల్‌మెంట్లు నడుపుతున్న రౌడీషీటర్

గుంటూరు నగరంపై ఆధిపత్యం కోసం వరుస హత్యలు

సొంత గ్యాంగ్‌లో విభేదాలు ముదిరి తాజాగా ముగ్గురు బలి

హత్యలకు ముందు బాహాబాహీకి  తెగబడ్డ రౌడీలు

జిల్లాలో కలకలం సృష్టించిన మూడు హత్యలు


 

గుంటూరు : గుంటూరు పేరు వినగానే రౌడీషీటర్ల దందాలు.. గ్యాంగ్‌వార్‌లు..సెటిల్‌మెంట్లు.. రాజకీయ హత్యలు గుర్తుకు వస్తాయి.. ఇది ఒకప్పుడు తీవ్రరూపం దాల్చి గత కొన్నేళ్లుగా సద్దు మణిగిన వైనం. అయితే టీడీపీ అధికారంలోకి రావడం, రాజధానిగా ప్రకటించడంతో మళ్లీ రౌడీషీటర్లు ఒక్కొక్కరుగా తమ ఆధిపత్యాన్ని  నిరూపించుకునేందుకు హత్యలకు తెగబడుతున్నారు. భూ వివాదాల్లో ఒకరిపై ఒకరు కక్ష పెంచుకుని హతమార్చుకుంటున్నారు. పేరుమోసిన రౌడీషీటర్లంతా కత్తులకే బలి కావడంతో కొంతకాలం పాటు నగరం ప్రశాంతంగా ఉంది. రెండేళ్లుగా నగరంలో రౌడీషీటర్లు మళ్లీ తమ దందాలు మొదలు పెట్టారు. కొందరికి అధికార పార్టీ నేతల అండ  ఉండడంతో  పోలీసులను లెక్కచేయని పరిస్థితి.



తాజాగా గుంటూరులో జరిగిన త్రిపుల్ మర్డర్స్ నగరవాసులకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. రాజధాని ఏర్పడిన తరువాత చిన్నచిన్న నేరాల సంఖ్య తగ్గినప్పటికీ రౌడీషీటర్లు మాత్రం తమ ఆగడాలను ఉధృతం చేస్తూనే ఉన్నారు. ఏడాదికాలంగా నగర, నగర శివారుల్లో చోటుచేసుకున్న రౌడీషీటర్ల హత్యాఘటనలను పరిశీలిస్తే భూ వివాదాలు, ఆధిపత్య పోరే కారణంగా కనిపిస్తోంది.

  గుంటూరు రూరల్ మండలం పొత్తూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెనుమచ్చ నాగేశ్వరరావు ఓ భూ వివాదం తీర్చాలంటూ రౌడీషీటర్లను ఆశ్రయించగా, దీన్ని గమనించి ఎదుటి వర్గం ఆయన్ను హతమార్చింది. భూ వివాదంలో తలదూర్చాడనే కారణంతో రౌడీషీటరు బచన్ శివను చుట్టుగుంట వద్ద ప్రత్యర్థులు హతమార్చారు. అనంతరం శివ అనే మరో రౌడీషీటర్‌ను బుడంపాడు పొలాల్లో ప్రత్యర్థి వర్గం మట్టుబెట్టింది.



రెండు నెలల క్రితం రౌడీషీటర్ ఉబ్బిశెట్టి రవిని ఆధిపత్య పోరులో భాగంగా ప్రత్యర్థులు హతమార్చారు.ఇటీవల మంగళగిరిలో ఒకేగ్యాంగ్‌లోని రెండువర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో హనుమంతు, రమేష్ అనే రౌడీషీటర్లు హతమైన విషయం విదితమే.  తాజాగా ఓ భూవివాదం పరిష్కరించాలంటూ జైలులో ఉన్న పేరుమోసిన రౌడీషీటర్‌ను కొందరు ఆశ్రయించారు. ఆ వివాదాన్ని పరిష్కరించాలంటూ తన గ్యాంగ్‌లోని అనుయాయులను ఆ రౌడీషీటర్ పురమాయించాడు. కొంతజాప్యం జరగడంతో అదే గ్యాంగ్‌లోని శివ అనే రౌడీషీటర్‌ను ఆశ్రయించారు. ఈ విషయంలో శివ తలదూర్చడంతోపాటు, జైలులో ఉన్న గ్యాంగ్‌లీడర్‌ను గౌరవించకుండా లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నాడనే కారణంతో అతడినే హతమార్చాలని పథక రచన చేశారు.  ఈ విషయం బయటకు పొక్కడంతో అప్రమత్తమైన శివ తనపై పథక రచన చేస్తున్న గ్యాంగ్‌లోని ముగ్గురు రౌడీషీటర్లను అర్ధరాత్రి హతమార్చాడు. ఈ ఘటన పేట్రేగిపోతున్న రౌడీషీటర్ల దారుణాలను తెలియజేస్తోంది.



పోలీసుల ఉదాసీన వైఖరి..

గుంటూరు నగరంలో 210 పైగా రౌడీషీట్‌లు ఉండగా, గుంటూరు అర్బన్ జిల్లాలో 450మందిపై రౌడీషీట్లు ఉన్నాయి. వీరిలో కొంత మంది తిరిగి తమ దందాలు కొనసాగిస్తుండగా, అధిక శాతం మంది రౌడీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగా యువకులు ఈ రౌడీషీటర్ల గ్యాంగుల్లో చేరి దందాలకు పాల్పడుతున్నారు. గతంలో ప్రతి ఆదివారం రౌడీషీటర్లను స్టేషన్‌లకు పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు, వారి కదలికలపై నిఘా ఉంచేవారు. రాజధాని నేపథ్యంలో సిబ్బంది కొరత, బందోబస్తులు, ఆందోళనలు, చైన్‌స్నాచింగ్‌లు పెరగడంతో పోలీసులు రౌడీషీటర్లపై దృష్టి సారించడం లేదు. దీనికి తోడు అధికార పార్టీ నేతల అండదండలతో పోలీసులు తమ జోలికి రాకుండా కొందరు రౌడీషీటర్లు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరులో రౌడీషీటర్ల ఆగడాలు పెరిగిపోవడంపై అన్ని వర్గాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వీటిపై పోలీసు అధికారులు సీరియస్‌గా దృష్టిసారించి రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేస్తున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top