దిశ చట్టం దేశానికే ఆదర్శం | Sakshi
Sakshi News home page

దిశ చట్టం దేశానికే ఆదర్శం

Published Mon, Mar 9 2020 11:41 AM

Gandham Chandrudu Open Disha Police Station in Anantapur - Sakshi

అనంతపురం క్రైం: నగరంలోని మూడవ పట్టణ పోలీసుస్టేషన్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన దిశ పోలీసుస్టేషన్‌ను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, డీఐజీ కాంతిరాణా టాటా ఆదివారం ప్రారంభించారు. అనంతరం దిశ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్, కంప్యూటర్‌ గదులు, పోలీసు స్టేషన్‌ ఆవరణంలోని ఆట స్థలం తదితర వాటిని వారు ప్రారంభించారు. కలెక్టర్‌ గంధం చంద్రుడు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టం దేశానికే ఆదర్శమన్నారు. కేసు నమోదైన మూడు వారాల్లోనే నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చట్టాన్ని రూపొందించారన్నారు. అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగకుండా మహిళల భద్రతే బాధ్యతగా ప్రభుత్వం దిశ పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేసిందన్నారు. మహిళలు, అమ్మాయిలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేసేందుకు పోలీసుస్టేషన్‌లో అన్ని సదుపాయాలు కల్పించారన్నారు.  

మహిళల పని వేళల్లో మార్పు
మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళా ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. వివిధ శాఖల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మహిళా ఉద్యోగుల విధులుంటాయన్నారు. ఆ తర్వాత సమయాల్లో విధులకు హాజరుకావాల్సిన అవసరం ఉండదన్నారు.  

మేమున్నాం 
మహిళలు, అమ్మాయిల భద్రత, రక్షణకు మేమున్నాం. ప్రభుత్వం మహిళల భత్రలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా దిశ చట్టాన్ని రూపొందించింది. కేసు రిజిస్టర్‌ చేసిన 21 రోజుల్లో స్పెషల్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా నిందితులకు శిక్షణ పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇటీవల చిత్తూరులో 90 రోజుల్లో ఓ వ్యక్తికి ఉరిశిక్షణ పడిన విషయం అందరికీ తెలిసిందే. మహిళలు, అమ్మాయిలు దిశ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.  దిశ పోలీసుస్టేషన్, వన్‌స్టాప్‌ సెంటర్‌ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. –కాంతిరాణా టాటా, డీఐజీ

ఏడు రోజుల్లో చార్జ్‌షీట్‌
దిశ పోలీసుస్టేషన్, యాప్‌లో ఫిర్యాదు చేసిన ఏడు రోజుల్లో నిందితులపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్, మెడికల్‌ సర్టిఫికెట్లు నిర్దేశిత సమయంలో సేకరించేలా ఆయా విభాగాలను సంసిద్ధం చేసుకున్నాం. ఇప్పటికే జిల్లాలో వివిధ ఘటనల్లో నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపాము. దిశ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తించే సిబ్బందికి అదనంగా 30 శాతం అలవెన్సులు, తదితర సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది.  – బీ.సత్యయేసుబాబు, ఎస్పీ

డీఎస్పీకిసన్మానం
దిశ పోలీసుస్టేషన్‌ ఏర్పాటుకు విశేష కృషి చేసిన డీఎస్పీ వీరరాఘవరెడ్డిని కలెక్టర్, డీఐజీ, ఎస్పీ సన్మానించారు. ఆయనతో పాటు దిశ పోలీసుస్టేషన్‌ ఏర్పాటుకు తమ వంతు సహకరించిన కియా, అర్జాస్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో ఐఏఎన్‌ అధికారి సుబ్రమణ్యం, జేసీ డిల్లీరావు, డీఎస్పీలు ఏ శ్రీనివాసులు, ఈ శ్రీనివాసులు, రమాకాంత్, సీఐలు ప్రతాప్‌రెడ్డి, రెడ్డప్ప, జాకీర్‌ హుస్సేన్‌ ఖాన్, కే శ్రీనివాసులు, మురళీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement