ఇంద్రకీలాద్రిపై నేటినుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
బెజవాడ ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తొలి రోజు స్వర్ణకవచాలంకృత శ్రీకనకదుర్గాదేవి అలంకారం
విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ, 3.30 గంటలకు స్నపనాభిషేకం, 6.30 గంటలకు బాలభోగ నివేదన, 7.30 గంటలకు నిత్యార్చనలు పూర్తయిన తర్వాత ఉదయం 9 గంటలకు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దారిద్య్రాలు నశిస్తాయని నమ్మకం. దసరా ఉత్సవాల సందర్భం గా ఇంద్రకీలాద్రిపై ఉన్న భవానీ దీక్షామండపంలో ప్రత్యేక కుంకుమార్చన నిర్వహిస్తారు.
కొండపై శివాలయం వద్ద ఉన్న యాగశాలలో విశేష చండీయాగం జరుగుతుంది. రాష్ట్ర విభజన తరువాత జరుగుతున్న తొలి దసరా ఉత్సవాలు కావడంతో వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆలయ పరిసరాలను అందంగా అలంకరించి, భక్తులకు అన్ని ఏర్పా ట్లు చేసినట్లు ఈవో వి.త్రినాథరావు తెలిపారు.


