అమెరికాలో ఉద్యోగాల పేరిట మోసం

fraud in the name of jobs

30 మంది వరకు బాధితులు

పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు

40 లక్షలు వరకు టోపీ

పెనమలూరు: అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి వారి వద్ద రూ.40 లక్షలు వరకు వసూలు చేసిన ఇద్దరు ఘరానా మోగాళ్లను కృష్ణాజిల్లా, పెనమలూరు పోలీసులు శనివారం అరెస్టు చేశారు.ఈ కేసులో మరో కీలక వ్యక్తి పరారీలో ఉన్నాడు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో సీఐ కె.దామోదర్‌ శనివారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. పెనమలూరు మండలం,  యనమలకుదురు గ్రామంలోని తాడిగడప డొంకరోడ్డుకు చెందిన విప్పర్ల మోహనరావు, బెంజిసర్కిల్‌ వద్ద ఉంటున్న అతని సోదరుడు విప్పర్ల కోటయ్యకు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన చర్చి ఫాదర్‌ ప్రసాద్‌తో పరిచయం ఉంది. ప్రసాద్‌కు తూర్పుగోదావరి జిల్లా వెలవడంకు చెందిన ఎం.సురేష్‌తో పరిచయం ఉంది.

సురేష్‌ తన సోదరి అమెరికాలో డాక్టర్‌గా పని చేస్తున్నారని, ఆమెకు అక్కడ కంపెనీ ఉందని ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఉద్యోగాల కోసం యువతను తీసుకొస్తే కమీషన్‌ ఇస్తామని ఆశచూపాడు. దీంతో మోహనరావు, కోటయ్య దాదాపు 30 మంది వద్ద రూ.40 లక్షలు వసూలు చేసి కొంత సురేష్‌కు ఇచ్చి, మిగితా సొమ్ము తమ వద్ద ఉంచుకుని వాడుకున్నారు. సొమ్ము ఇచ్చిన వారు అమెరికా ఎప్పుడు పంపుతావని వారిని ప్రశ్నిస్తుంటే తప్పుకుని తిరుగుతున్నారు. బాధితులకు అనుమానం వచ్చి పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

డొంక కదిలింది ఇలా..
యనమలకుదురు తాడిగడప డొంక రోడ్డు హైదర్‌గర్‌కు చెందిన సైకం సుదర్శనం కొద్ది నెలల క్రితం అమెరికాలో ఉద్యోగం కోసం మోహనరావు, కోటయ్యకు రూ.లక్ష ఇచ్చాడు. యనమలకుదరుకు చెందిన వాటాల ప్రసాద్‌ రూ.50 వేలు, ఉయ్యూరు మండలం కడవకొల్లుకు చెందిన వేమూరి విజయ్‌కుమార్‌ రూ.2 లక్షలు, రామవరప్పాడుకు చెందిన అంకెం సాయివెంకట్‌ రూ.1.50 లక్షలు, చల్లపల్లికి చెందిన నరహరశెట్టి అశోక్‌కుమార్‌ రూ.1.50 లక్షలు, విజయవాడ గులాబితోటకు చెందిన బండిరెడ్డి నాగబాబు రూ.1.80 లక్షలు చొప్పున మోహనరావు, కోటయ్యకు ఇచ్చారు. సొమ్ము ఇచ్చి మోసపోయిన సుదర్శనం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మోసపోయిన మిగితా వారు ఆయా ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. ఇంకా మోసపోయానవారు ఉన్నా వారు ఫిర్యాదులు చేయలేదు.

నిందితుల అరెస్టు...
పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి నిందితులు ఇద్దరిని సీఐ దామోదర్‌ శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో కీలకంగా ఉన్న సురేష్‌ పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు.ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసానికి పాల్పడుతున్న ఘరానా వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top