అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ పలు మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది.
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ పలు మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర తరహాలో ఆ శాఖను రూపుదిద్దేందుకు మన ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉద్యోగుల చేతికి ఇక ఆయుధాలు రానున్నాయి. స్మగ్లింగ్‌ను, భూ ఆక్రమణలను అరికట్టేందుకు అడవులకు ఇక సాయుధ అటవీ బలగాలు తరలనున్నాయి. ఇప్పుడు ఉన్న అటవీ శాఖ రేంజ్ కార్యాలయాలను పోలీస్ స్టేషన్ల తరహాలో అటవీ స్టేషన్లుగా మార్చనున్నారు. దీనికి సంబంధించిన జీఓ విడుదలైనా ఆయుధాలను సరఫరా చేయటంలో తాత్సారం చేస్తున్నారని పలువురు సిబ్బంది చెబుతున్నారు. నిరాయుధులుగా ఉన్న అటవీ సిబ్బందిపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఇందల్‌వాయి ఎఫ్‌ఆర్‌ఓ గంగయ్య హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి ప్రకటించారు.
గౌరవం పెరుగుతుంది
అటవీ క్షేత్రాధికారి (రేంజ్) అంటే పోలీస్ శాఖలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి. కానీ, ఒక కానిస్టేబుల్‌కు భయపడినంతగా.. ఆయనకు భయపడరని, చేతిలో ఆయుధం లేకపోవటమే ఇందుకు కారణమని అటవీ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. కొత్త విధానంతో తమకు గౌరవం కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటవీ అధికారులు తమను ఏమీ చేయలేరని అక్రమార్కులకు ఒక ధీమా ఉందని, అందుకే చెట్ల నరికివేతలు, అక్రమ రవాణాకు భయపడటం లేదని వారు అంటున్నారు. కొన్ని సమయాల్లో పోలీసుల సాయంతో స్మగ్లర్లను భయపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడేదని, తమ చేతిలోనే ఆయుధాలు ఉంటే ఆ పరిస్థితి తొలగిపోతుందని చెబుతున్నారు.