అయ్యో..రామ!

Food Poison In Sriramanavami Celebrations - Sakshi

ప్రాణం మీదకు తెచ్చిన కలుషిత పానకం

ఎ.కొండూరు శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి

215 మందికి అస్వస్థత, 25 మందికి తీవ్ర అస్వస్థత

బాధితులతో నిండిన తిరువూరు, మైలవరం ఆస్పత్రులు

శ్రీరామనవమి వేడుకల్లోఅపశ్రుతి చోటుచేసుకుంది. ఎ.కొండూరు మండలం చైతన్య నగర్, మత్రియాతండాకు చెంన గిరిజ నులు కలుషిత పానకం తాగి  అస్వస్థతకు గుర య్యారు.  ఎ.కొండూరులో సోమవారం నిర్వహించిన సీతారామకల్యాణోత్సంలో పానకం తాగడం వల్ల  వీరంతా అనారోగ్యానికి గురయ్యారు. మొత్తం    215  మంది బాధితులు తిరువూరు, మైలవరం, నూజివీడు, విజయవాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తిరువూరు/ఎ.కొండూరు: కొండూరు మండలంలోని మత్రియా తండా,  చైతన్య నగర్‌ తండాకు చెందిన మహిళలు, యువకులు, చిన్నారులు మంగళవారం ఉదయం నుంచి   విపరీతమైన జ్వరం, వాంతులు, విరేచనాలతో కళ్లు తిరిగి  కింద పడిపోతుండటంతో స్థానికులు  పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులకు సమాచారమిచ్చారు.  మండల అధికారులు  హుటా హుటిన  ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు అత్యవసర వైద్యసేవలందిస్తున్నారు.  ప్రథమ చికిత్స అనంతరం బాధితులను ఏకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,  తిరువూరు, మైలవరం, నూజివీడు ప్రభుత్వాసుపత్రులకు  108 వాహనాల్లో తరలించారు.  తిరువూరు ఏరియా ఆసుపత్రిలో 83 మంది, మైలవరంలో 73 మంది, నూజివీడులో 35మంది, ఆంధ్రా ఆసుపత్రిలో 25 మందిని చేర్పించారు.  మైలవరం ప్రభుత్వాసుపత్రి నుంచి బి.సీత,  సతి, కౌసిలి, సొని, తావిర్యాలను మెరుగైన వైద్యం నిమిత్తం  విజయవాడ ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. మొత్తంలో బాధితులు 215 మంది ఉండగా వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

కడగని డ్రమ్ములో కలిపినపానకంతోనే ప్రమాదం?
శ్రీరామనవమి వేడుకల్లో భక్తులకు పంపిణీ చేసేందుకు తయారు చేసిన పానకం సేవించిన కారణంగానే మత్రియాతండా గిరిజనులు అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. మామిడి తోటలకు  పిచికారీ  చేసిన మందుల డ్రమ్ముల్లోనే పానకం  కలపడంతో కలుషితమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.  గిరిజనుల అస్వస్థతకు కారణమైన పానకం, ప్రసాదం నమూనాలను పరీక్షల నిమిత్తం విజయవాడ పంపించారు.

తక్షణ వైద్యసేవలకు కలెక్టర్‌ ఆదేశం....
కలుషిత పానకం, ప్రసాదం తిని అస్వస్థతకు గురైన మత్రియాతండా, చైతన్యనగర్‌ గిరిజనులకు తక్షణ వైద్యసేవలందించాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం వైద్యాధికారుల్ని ఆదేశించారు.  ఏకొండూరు అడ్డరోడ్డులో గిరిజనుల్ని పరామర్శించిన  కలెక్టర్‌ దగ్గరుండి వైద్య సహాయ చర్యలను పర్యవేక్షించారు. మైలవరం, తిరువూరు ప్రభుత్వాసుపత్రుల్లో  చికిత్స పొందుతున్న  జ్వరపీడితులు క్షేమంగా ఇళ్లకు చేరే వరకు వైద్యసేవల్లో ఎటువంటి లోపం లేకుండా చూడాలని సూచించారు. జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్‌ జ్మోతిర్మయి, జిల్లా ఆసుపత్రి ఎపిడమాలజిస్టు  ఎ.నాగేశ్వరరావు వైద్యసేవలను పర్యవేక్షించారు.  పులిహోర, పానకం కారణంగానే గిరిజనులు అస్వస్థతకు గురయ్యారని  తహసీల్దార్‌ సురేష్‌కుమార్, అదనపు డీఎంఅండ్‌హెచ్‌వో  శాస్త్రి కలెక్టరుకు వివరించారు.

నలుగురు విద్యార్థులకు అస్వస్థత...
మైలవరం: పిల్లల మీద ప్రేమతో చైతన్య తండా వాసులు  మైలవరం గిరిజన సంక్షేమ వసతి గృహంలో చదువుకుంటున్న తమ పిల్లలకు ప్రసాదం, పానకం తీసుకువచ్చి తినిపించడంతో నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించారు. కలెక్టర్‌ లక్ష్మీకాంతం హుటాహుటిన మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా వైద్యులకు సూచించారు. ప్రభుత్వ అసుపత్రిలో సౌకర్యాలు లేమితో పాటు కరెంట్‌ కూడా లేకపోవడం గమనించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఎలక్ట్రిసిటీ ఆధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top