భూసార పరీక్షలపై దృష్టి పెట్టండి | Sakshi
Sakshi News home page

భూసార పరీక్షలపై దృష్టి పెట్టండి

Published Fri, May 22 2015 2:33 AM

Focus on soil tests

- వచ్చే వారం రోజులు క్షేత్రాల్లోనే ఉండాలి
- వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదనరావు
సాక్షి, విశాఖపట్నం :
భూసార పరీక్షలు, సూక్ష్మపోషక పదార్థాల వినియోగంపై ఆశించినస్థాయిలో రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారని రాష్ర్ట వ్యవసాయశాఖ కమిషనర్ కె.మధుసూదనరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖరీఫ్ సన్నద్ధతపై స్థానిక జిల్లా పరిషత్ సమావేశ  మందిరంలో గురువారం జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల జేడీలు, ఏఓలు, వ్యవసాయ విస్తరణాధికారుల స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగించారు. విశాఖపట్నంలో భూసార పరీక్షలు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. 2015-16లో 32,070 శాంపిల్స్ తీయాలని లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు 14,009 మాత్రమే తీయగలిగారు. వాటిలో ఇప్పటి వరకు 10,335 శాంపిల్స్ మాత్రమే ల్యాబ్స్‌కు పంపగా, 4138 శాంపిల్స్ మాత్రమే పరీక్షించగలిగారన్నారు. సకాలంలో భూసార పరీక్షలు జరిపి తగిన సూచనలు ఇవ్వక పోవడం వల్ల మోతాదుకు మించి ఎరువులను వినియోగిస్తున్నారని, తద్వారా సూక్ష్మ పోషకాలు అందడం లేదన్నారు. ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయం పట్ల రైతులను ఆకర్షితులను చేయాలన్నారు. గ్రామీణ విత్తనోత్పత్తిని పెంచడం ద్వారా రైతులకు విత్తన కొరత తీర్చాలన్నారు. శుక్రవారం నుంచి వ్యవసాయ విస్తరణాధికారులు వారం రోజుల పాటు రైతు క్షేత్రాల్లోనే ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ యువరాజ్ మాట్లాడుతూ జిల్లాలో రాజ్‌మా సాగును స్పెషల్ ప్రాజెక్టుగా తీసుకోవాలని, మిల్లట్స్, పాడీ, మైజా విస్తీర్ణాన్ని పెంచేలాన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందజేయనున్నట్టు చెప్పారు. భూసారంలో జింక్, జిప్సం, బోరాన్ వంటి ధాతువుల లోపాల నివారణ గురించి ఏడీ విజయప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం  జేడీలు సత్యనారాయణ, ప్రమీల, అప్పలస్వామి, ఆత్మ పీడీలు  సీఎన్ శ్రీనివాసులు, శివప్రసాద్ పాణిగ్రాహి పాల్గొన్నారు.

Advertisement
Advertisement