చేపల వేటపై వివాదం 

Fishes Hunting Fight Between Two Groups In Nellore - Sakshi

తహసీల్దార్‌ కార్యాలయంలో

ఇరువర్గాల పంచాయితీ

సాక్షి, మనుబోలు: మండలంలోని లక్ష్మీనరసింహపురంలో బంగారమ్మ చెరువుకు సంబంధించి చేపల వేట విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. దీంతో మత్స్యశాఖ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు, గూడూరు రూరల్‌ సీఐ వంశీకృష్ణ, తహసీల్దార్‌ లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో బంగారమ్మ చెరువు సొసైటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. నాలుగేళ్ల క్రితం బంగారమ్మ చెరువు చేపల సొసైటీని ఎల్‌ఎన్‌పురం, పిడూరు గ్రామాలకు వేర్వేరుగా విభజించి రెండు సొసైటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 30 మంది సభ్యులతో ఎల్‌ఎన్‌పురం సొసైటీని ఏర్పాటు చేశారు.

నాలుగేళ్లుగా బంగారమ్మ చెరువులో చేపల వేట సాగిస్తున్నా తమకు రూపాయి కూడా పైకం చెల్లించ లేదని కొందరు సభ్యులు వాపోతున్నారు. ఈ ఏడాదైనా తమకు కూడా వాటా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొనడంతో ఓ వర్గం వారు తరచూ చేపల వేటను అడ్డుకుంటున్నారు. ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో వివాదం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది. దీన్ని రెవెన్యూ కార్యాలయంలో పరిష్కరించుకోవాలని చెప్పడంతో స్పందించిన తహసీల్దార్‌ లక్ష్మీకుమారి సీఐ, మత్స్యశాఖ ఇన్‌స్పెక్టర్లను పిలిపించి తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.

మత్స్య సంపదను కొల్లగొడుతున్న టీడీపీ నాయకుడు
సమాశంలో కొందరు సభ్యులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు సొసైటీని తన గుప్పెట్లో పెట్టుకుని తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మత్స్య సంపదను కొల్లగొడుతున్నాడని ఆరోపించారు. కేవలం తనకు అనుకూలంగా ఉండే కొందరికి కొద్దిగా నగదు ఇచ్చి మిగిలినదంతా అతను దోచుకుంటున్నాడని తెలిపారు. అధికారులు స్పందించి చెరువులో చేపలపై అందరికీ హక్కు కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన తహసీల్దార్‌ లక్ష్మీకుమారి మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున చేపల వేటకు ఎవరికీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపారు.

ఈ నెల 28వ తేదీ వరకూ కోడ్‌ ఉన్నందున ఎవరూ చెరువులో దిగవద్దని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వేట సాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నెలాఖరు వరకూ ఆగితే చెరువులో నీళ్లు తగ్గి చేపలు చనిపోతాయని కొందరు అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో మత్స్యశాఖ ఇన్‌స్పెక్టర్‌ చెరువులను పరిశీలించి నివేదక ఇవ్వాలని తహసీల్దార్‌ ఆదేశించారు. నివేదకను కలెక్టర్‌కు పంపించి అనుమతి ఇచ్చిన తరువాతే వేటకు దిగాలని సూచించారు. ఇరు వర్గాల ఘర్షణకు దిగితే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top