టీడీపీ వారి చేపల చెరువు 

Fishery Ponds Occupied By TDP Leaders In Hindupur Constituency - Sakshi

రూ.5 లక్షలు పంచాయతీ సొమ్ము స్వాహా!

గుట్టుచప్పుడు కాకుండా చెరువు విక్రయం 

చెరువులో రూ.20 లక్షల విలువైన సంపద 

ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్థానికుల డిమాండ్‌ 

నీళ్లు మనవిరా.. 
ఆ చెరువు మనదిరా.. 
పంచాయతేందిరో.. ఆ ప్రజలు ఏందిరో.. 
చెప్పినంత ఇచ్చుకో..
చెరువు కొనేసుకో.. 
ఇదీ హిందూపురం ప్రాంతంలో తెలుగుదేశం నాయకుల తీరు 

హిందూపురం నియోజకవర్గంలో కబ్జాకు ఏదీ అనర్హం కాదని తెలుగు తమ్ముళ్లు నిరూపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి అంశంలోనూ అడ్డగోలుగా దోచేశారు. ప్రభుత్వ ఆధీనంలోని ఓ చెరువును విక్రయించేసి సొమ్ము చేసుకున్నారు. మాజీ సీఎం చంద్రబాబు బావమరిది, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అండతోనే ఈ అక్రమాలు సాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.   

సాక్షి, హిందూపురం : ‘రాజావారి చేపల చెరువు’ సినిమా గుర్తింది కదూ! అచ్చం అలాంటిదే. అదే కథను పోలిన విధంగా ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అనుచరులు కొందరు హిందూపురం మండలం బేవినహళ్లి చెరువును అక్రమంగా విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తి చెరువులో చేపపిల్లల పెంపకం చేపట్టాడు. ప్రస్తుతం ఆ చెరువులో రూ. 20 లక్షల విలువైన జలపుష్పాలు ఉన్నాయి.  

అసలేం జరిగింది..?  
పంచాయతీల పరిధిలో ఉన్న చెరువులో చేప పిల్లల పెంపకం చేపట్టేందుకు ఆయా పంచాయతీలే అధికారికంగా వేలం నిర్వహిస్తూ ఉంటాయి. అలా వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులకు వినియోగిస్తుంటారు. అయితే బేవినహళ్లి గ్రామంలోని చెరువును స్థానికులకు, పంచాయతీ అధికారులకు తెలియకుండానే తెలుగు తమ్ముళ్లు విక్రయించి, నిధులు స్వాహా చేశారు. ఈ అక్రమాల వెనుక అప్పటి టీడీపీ ఎంపీపీ సుభద్రమ్మ బంధువు విజయ్‌కుమార్, సాగునీటి సంఘాల అధ్యక్షుడు శ్రీరాములు, ఈ.నాగరాజు ఉన్నట్లు ఆరోపణలున్నాయి.  

చేతులు మారిన రూ.5 లక్షలు  
ఉమ్మడి హక్కుగా బేవినహళ్లి ప్రజలు సాధించుకున్న చెరువు నీటిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. తమ మాట కాదని చెరువు కట్టను పూడ్పిన గ్రామస్తులపై టీడీపీ నాయకులు క్షుద్ర రాజకీయాలకు తెరలేపారు. పూర్తిగా నిండిన చెరువును బెంగళూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి గుట్టుగా అమ్మేశారు. రూ.1.50 లక్షలకు అమ్మేసినట్లు అగ్రిమెంట్‌ రాసిచ్చారు. అయితే వాస్తవానికి ఈ అక్రమ వ్యవహారం వెనుక రూ. 5 లక్షలు చేతులు మారినట్లు సమాచారం.  

విషయం వెలుగు చూసిందిలా..  
టీడీపీ నాయకుల నుంచి చెరువును కొనుగోలు చేసిన వ్యక్తి అందులో రెండు లక్షల చేప పిల్లలను వదిలాడు. అవి కాస్తా పెరిగి పెద్దవయ్యాయి. ఇంతలో ప్రభుత్వం మారింది. చెరువును విక్రయించిన వారంతా తేలు కుట్టిన దొంగలయ్యారు. వారం రోజులుగా చెరువులో చేపల వేట మొదలైంది. కర్ణాటక వాసి రోజూ చెరువు వద్దకు చేరుకుని చేపలు తరలించడం మొదలు పెట్టాడు. పంచాయతీ అధీనంలోని చెరువులో చేపల వేట కొనసాగిస్తుండడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. టీడీపీ నాయకులు తన వద్ద డబ్బు తీసుకుని చెరువు అమ్మేశారని, హక్కుదారుగా అందులో చేపల పెంపకాన్ని చేపట్టినట్లు కర్ణాటక వాసి గుట్టు రట్టు చేశాడు. దీంతో విషయం కాస్తా పోలీసుల వద్దకు చేరింది.  

చెరువు నీళ్లు బాలయ్యవట! 
పంచాయతీకి చెందిన చెరువులో అక్రమంగా చేపలను వదలడమే కాకుండా, రూ. లక్షలు దండుకుని ఏ హక్కుతో చెరువును అమ్మేశారంటూ టీడీపీ నాయకులను బేవినహళ్లివాసులు నిలదీసినట్లు తెలిసింది. అయితే చెరువును నింపిన హంద్రీ–నీవా నీరు తమ నాయకుడు బాలకృష్ణవేనని, తమ నీళ్లు తమ ఇష్టం వచ్చినట్లు వినియోగించుకుంటామంటూ టీడీపీ నాయకులు గ్రామస్తులపై మరోసారి జులుం ప్రదర్శించినట్లు సమాచారం. ప్రస్తుతం చెరువులో రూ. 20లక్షల విలువైన చేపలు ఉన్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి, పంచాయతీకి దక్కాల్సిన నిధులను దోచుకున్న వారిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టడంతో పాటు, చెరువులోని సంపదను స్వాధీనం చేసుకుని పంచాయతీ అభివృద్ధికి వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు.    

ఓట్ల కోసం హడావుడి..
2019 ఎన్నికల తాయిలంలో భాగంగా హిందూపురంలోని సూరప్ప చెరువును హంద్రీ–నీవా నీటితో నింపేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రయత్నాలు చేపట్టారు. వాస్తవానికి బేవినహళ్లి చెరువు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత సూరప్ప చెరువుకు నీటిని తీసుకెళ్లాల్సి ఉంది. అయితే సూరప్ప చెరువును నీటితో నింపేందుకు బేవినహళ్లి చెరువు నిండకుండానే కట్టను దౌర్జన్యంగా ఎమ్మెల్యే అండతో ఆయన అనుచరులు తెంపేశారు. ఈ విషయంపై బేవినహళ్లి వాసులు కోపోద్రిక్తులయ్యారు. ఐక్యంగా ఉద్యమించి చెరువు కట్ట గండిని పూడ్చేశారు. ఆ సమయంలో గ్రామస్తులకు, ఎమ్మెల్యే బాలయ్య అనుచరుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయినా టీడీపీ నాయకుల దౌర్జన్యాలను గ్రామస్తులు ఐకమత్యంతో ఎదుర్కొన్నారు. 

హంద్రీ–నీవా నీళ్లు వాళ్లవేనంట 
మా బేవినహళ్లి చెరువులోకి హంద్రీ–నీవా నీరు వదిలారు. ఈ చెరువులో మాకు కానీ, అధికారులకు కానీ కనీస సమా చారం కూడా లేకుండా కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి రెండు లక్షల చేప పిల్లలను వదిలాడు. వారం రోజులుగా అతను చెరువు వద్ద మకాం వేసి చేపల వేట కొనసాగిస్తున్నాడు.  ఈ చెరువును టీడీపీ నాయకులు అమ్మేశారని చెప్పడంతో షాక్‌ తిన్నాం. హంద్రీనీవా నీళ్లు వాళ్లవేనంట.  
– ఓబన్న, బేవినహళ్లి

నిధులు మింగేశారు 
చెరువు అనేది స్థానిక పంచాయతీకి ఆదాయ వనరుగా ఉంది. ఇందులో చేపల పెంపకం చేపట్టడం ద్వారా పంచాయతీకి పెంపకందారు సుంకం చెల్లించాల్సి ఉంది. అలాంటి చెరువును టీడీపీ నాయకులు స్వార్థం కోసం అమ్మేసుకున్నారు. పంచాయతీకి అందాల్సిన నిధులను అక్రమంగా స్వాహా చేశారు. ప్రభుత్వం స్పందించి నిధులు దోచుకున్న టీడీపీ నాయకులపై చర్యలు చేపట్టాలి.    
– రామాంజునరెడ్డి, బేవినహళ్లి 

నోటీసులిస్తాం 
చెరువు ఆదాయ వనరులను వేలం పాట ద్వారా అధికారికంగా విక్రయించాలి. అయితే అధికారులకు, గ్రామస్తులకు తెలియకుండా కొందరు ఈ చెరువుపై పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దీనిని తీవ్ర నేరంగా పరిగణిస్తాం. సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి, చెరువును ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటాం.     – చంద్రశేఖర్, ఈఓఆర్డీ, హిందూపురం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top