అవినీతి పేరుకుపోయింది.. | first Council badtet meeting Accumulation corruption | Sakshi
Sakshi News home page

అవినీతి పేరుకుపోయింది..

Feb 22 2015 12:07 AM | Updated on Sep 2 2017 9:41 PM

నగరపాలక సంస్థ బడ్జెట్ ఆదాయాన్ని పెంచడం మాని అవినీతిని ప్రోత్సహించేదిగా ఉందని అధికార,

 సాక్షి, రాజమండ్రి : నగరపాలక సంస్థ బడ్జెట్ ఆదాయాన్ని పెంచడం మాని అవినీతిని ప్రోత్సహించేదిగా ఉందని అధికార, విపక్ష సభ్యులు మండిపడ్డారు. ప్రజల సొమ్మును సిబ్బంది జేబులో వేసుకుంటుంటే, సంస్కరించడం మాని తగ్గిన ఆదాయాన్నే అంచనా ఆదాయంగా లెక్కలు చూపడం అధికారుల అవినీతికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. ప్రస్తుత కౌన్సిల్ తొలి బడ్టెట్ సమావేశం శనివారం మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన  జరిగింది. మేయర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జరిగిన చర్చలో.. కీలక విభాగాల్లో రాబడి పడిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారని సభ్యులు ముక్త కంఠంతో నిలదీశారు.
 
 వైఎస్సార్ కాంగ్రెస్‌కి చెందిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీకి చెందిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీకి చెందిన సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలతో పాటు పలువురు సభ్యులు విభాగాల వారీగా ఆదాయ అంచనాలను ఎత్తిచూపుతూ పద్ధతి మార్చుకోవాలని అధికారులకు హితవు పలికారు. గత మూడేళ్లతో పోలిస్తే కీలక విభాగాల్లో రాబడి తగ్గిపోందని, ఇందుకు అన్నిస్థాయిల్లో పేరుకు పోయిన అవినీతే కారణమని ఆరోపించారు. తీరు మారకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఇతర సభ్యులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి తుది అంచనాల నాటికి బడ్జెట్‌ను సంస్కరిస్తామని హామీ ఇచ్చారు. సభ్యులు లేవనెత్తిన అంశాలు పరిశీలించి పరిపాలనను గాడిన పెడతామని కమిషనర్ జె.మురళి పేర్కొన్నారు.
 
 జనం గుడారాల్లో ఉంటున్నారా? : ఆదిరెడ్డి
 పన్నుల వసూళ్లలో అవినీతి పేరుకుపోయిందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. భవన నిర్మాణాల అనుమతి, లెసైన్సు ఫీజుల వివరాలు చూస్తే జరుగుతున్న అవినీతి వెల్లడవుతుందన్నారు. 2013-14లో రూ.1.66 కోట్ల ఆదాయం వస్తే 2014-15లో అది రూ.కోటికి పడిపోయిందన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి అంచనాలను రూ.1.50 కోట్లుగా చూపారంటూ..ఈ మూడేళ్లలో ఇళ్లు నిర్మించుకుంటున్న వారే లేరా లేకపోతే జనం అంతా గుడారాలు వేసుకుని జీవిస్తున్నారా అనుమానం కలుగుతోంద ని వ్యాఖ్యానించారు. వినోదపు పన్ను, ప్రకటన పన్ను, ట్రేడ్ లెసైన్సులు ఇలా అన్నింటా రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతుంటే చోద్యం చూస్తున్నారని, బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని విమర్శించారు.
 
 పెరగని వసూళ్లే నిర్వాకానికి నిదర్శనం : గోరంట్ల
 రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల కూడా అధికారులపై ధ్వజమెత్తారు. ఇప్పటికీ కార్పొరేషన్‌లో ఆస్తిపన్ను ఆదాయం రూ.24 కోట్లు మాత్రమే ఉందన్నారు. ఆదాయం పెంపునకు అధికారుల కృషి ఏ పాటిదో కీలక విభాగాల్లో పెరగని వసూళ్లే నిదర్శనమన్నారు. ప్రజారోగ్య శాఖకు సుస్తీ చేసిందని, రెండేళ్లుగా మురుగునీటి పైపులు బద్దలై మురుగంతా గోదావరిలోకలిసి పోతుంటే పట్టించుకున్న నాథులు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 పుష్కరాల్లేకుంటే అభివృద్ధి జరగదా? : ఆకుల
 పుష్కరాలు వస్తున్నాయి, నగరం అభివృద్ధి చెందుతుందంటున్నారని, పుష్కరాలు రాకపోతే నగరాన్ని అభివృద్ధి చేయరా అని సిటీ ఎమ్మెల్యే ఆకుల ప్రశ్నించారు. నగరంలో నివసించే నాలుగు లక్షల మంది బాగోగులు పట్టవా అని నిలదీశారు. సాధారణంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు సక్రమంగా చేపడితే పుష్కరాలపై నేడింత ఒత్తిడి ఉండేది కాదన్నారు.
 
 ఆదాయంపై ధ్యాస లేదు : షర్మిళారెడ్డి
 నగరపాలక సంస్థ అధికారులకు ఆదాయంపై ధ్యాస లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్లోర్ టీడర్ మేడపాటి షర్మిళా రెడ్డి విమర్శించారు. బడ్జెట్ కేవలం అంకెల గారడీగా ఉందని, ఆదాయం ఎలా పెంచుకోవాలన్న ప్రణాళికలు అధికారుల వద్ద లేవని అన్నారు. బడ్జెట్ గణాంకాలపై టీడీపీ సీనియర్ సభ్యులు సైతం వ్యతిరేకత వ్యక్తం చేశారు. వివరాలన్నీ బాగానే ఉన్నాయని ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాస్ సమర్థించే ప్రయత్నం చేయగా టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. బడ్జెట్ పుస్తకంలో అక్షరాలు సరిగానే ఉన్నాయని, కానీ ఆ అంకెలే అధికారుల  గారడీ సంఖ్యల్లా ఉన్నాయని తిప్పికొట్టారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం బడ్జెట్‌ను ఆమోదించడంతో 1.30 గంటలకు ముగిసింది. డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
 
 పుష్కర పనుల ప్రస్తావనేదీ?
 నగరపాలక సంస్థ బడ్జెట్‌లో పుష్కరాల పనుల ప్రస్తావన లేదు. ప్రభుత్వం పుష్కర గ్రాంటుగా రూ.240 కోట్లు ఇస్తుందని వివిధ పథకాలపై వచ్చే గ్రాంట్ల కింద చూపినా వాటితో ఏ పనుల చేస్తారో పేర్కొనలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement