విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

Fire accident In Prakasam district - Sakshi

మంటల్లో కాలిబూడిదైన పొగాకు గోడౌన్‌లు

సామగ్రి మొత్తం కాలిపోవడంతో రోడ్డున పడిన కూలీలు

ఆస్తి నష్టం అంచనా సుమారు 7 లక్షల రూపాయలు

ప్రకాశం  /నాగులుప్పలపాడు: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగి ఐదు పొగాకు గోడౌన్‌లతో పాటు కూలీలకు సంబంధించిన సామగ్రి, దుస్తులు, గడ్డివామిలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో సుమారు 7 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం అగ్రహారంలో జరిగింది. స్థానికులు, బాధితుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన పొద వెంకటేశ్వర్లు, పొద శ్రీధర్‌లకు చెందిన పొగాకు బ్యారన్‌ల వద్దకు పొగాకు తీత కోసం కొరిశపాడు మండలం రావినూతలకు చెందిన 20 మంది కూలీలు 5 రోజుల కిందట వచ్చారు. 

ఈ క్రమంలో కూలీలు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుడిసెలు వేసుకుంటున్నారు. సామగ్రిని పొగాకు గూడౌన్‌ల వద్ద ఉంచుకున్నారు. కూలీలు పని చేసుకుంటున్న క్రమంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటై నిమిషాల వ్యవధిలో మంటలు గోడౌన్‌లతో పాటు గడ్డివామిలకు అంటుకున్నాయి. క్షణాల్లో కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో ఇద్దరు రైతులకు చెందిన గోడౌన్‌లోని బ్యారన్‌ల సామగ్రి, కర్రతో పాటు కూలీల సామగ్రి, పక్కనే ఉన్న గడ్డి వామిలు, సుమారు ఎకరం పొగ తోట బూడిదైంది. విషయం తెలుసుకున్న ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి వెంకటేశ్వర్లు తన సిబ్బందితో వచ్చి మంటలు అదుపు చేశారు. 

 అప్పటికే పూర్తిగా కాలిపోయిన గోడౌన్‌ల నుంచి మంటలు గ్రామంలోకి వ్యాపించకుండా అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. కట్టపడి కూడబెట్టుకున్న ఆస్తి ఆగ్నికి ఆహుతైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

క్షణాల్లో మంటలు వ్యాపించాయి: 
అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంలో మా పొగాకు గోడౌన్‌లోని బ్యార్‌న్‌లకు సంబంధించిన సామగ్రి పూర్తిగా కాలిపోయింది. అగ్ని ప్రమాదానికి తోడు గాలులు కూడా పెరగడంతో క్షణాల్లో మంటలు పెరిగాయి. ఐదు గోడౌన్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. మా కూలీల సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం తలచుకుంటే చాలా భయానకంగా అనిపిస్తోంది. 
పొద శ్రీధర్‌ రైతు, అగ్రహారం

పొట్టచేత పట్టుకుని వచ్చాం:  
బతుకు దెరువు కోసం పొట్ట చేతబట్టుకొని వచ్చాం. 3 నెలల పని కోసం గుడిసెలు ఏర్పాటు చేసుకునే క్రమంలో విద్యుత్‌ ప్రమాదంతో పెద్ద ప్రమాదం జరిగింది. లోపల పడుకున్న పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో మా సామగ్రి మొత్తం కాలిపోయింది. చివరకు కట్టుబట్టలతో ఉండిపోయాం. 
పచ్చాకు కూలీలు
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top