
గంటల్లోనే చేధిస్తాం
చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో బాలుడు దహన ఘటనకు కుటుంబ కలహాలే కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో బాలుడు దహన ఘటనకు కుటుంబ కలహాలే కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. సత్యనారాయణపురానికి చెందిన టిటిడి ఉద్యోగి మునిరత్నం రెడ్డి కుమారుడు 12 ఏళ్ల మురళి అనే బాలుడి మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. చంద్రగిరి మండలం తొండవాడ బైపాస్ రోడ్డు ప్రక్కన కొందరు గుర్తు తెలియని దుండగులు బాలుడిని హతమార్చి, మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పు అంటించారు. పూర్తిగా కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
నిన్న సాయంత్రం నుంచి మురళి కనిపించకుండాపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. బాబు చేతికి కడియం ఉన్నట్టు ఫిర్యాదులో ఉండడం, మృతదేహానికి కూడా కడియం ఉండడంతో మురళి అని పోలీసులు నిర్థారించారు. క్షేమంగా తిరిగొస్తాడనుకున్న కుమారుడు, కనీసం గుర్తుపట్టనంతగా కాలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు పోలీసులు బృందాలను ఏర్పాటు చేశారు. కుటుంబ సమస్యల గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు. ఆస్తి తగదాలే ఘటనకు కారణమై ఉంటాయన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ నిందితులను ఖచ్చితంగా పట్టుకుంటామని డిఎస్పీ రవిశంకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కొన్ని గంటల్లోనే బాలుడు మృతి కేసును చేధిస్తామని ఆయన సాక్షి టీవీకి చెప్పారు.