breaking news
Tondawada bypass Road
-
వివాహేతర సంబంధంతో కొడుకు హత్య
తిరుపతి : మూడు రోజుల క్రితం తిరుపతి సమీపంలో జరిగిన బాలుడి మురళి హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. బాలుడి తల్లి అరుణ, ఆటో డ్రైవర్ సోమశేఖర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధం కారణంగానే వారు బాలుడిని హతమార్చినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తిరుపతి శివారులోని ఓ హోటల్లో విచారిస్తున్నారు. నిందితుడిని రాత్రికి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే...చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ ప్రాంతంలోని బైపాస్‌రోడ్డుకు సమీపంలో నిర్జన ప్రదేశంలో తొమ్మిదేళ్ల వయసు కలిగిన బాలుడిని పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈ సంఘటన శనివారం వెలుగుచూసింది. బాలుడు 80 శాతం కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. అయతే మెడలోని తాయత్తు, చేతిలోని కంకణం ద్వారా మృతిచెందిన బాలుడు టిటిడి చైర్మన్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసే మునిరత్నం కుమారుడు మురళిగా పోలీసులు గుర్తించారు. అతని చొక్కా జేబులో ఉన్న చాక్లెట్ కూడా అలాగే ఉంది. గుర్తుపట్టకుండా చేసేందుకు మాత్రమే ముఖంపైన పెట్రోల్ పోసి కాల్చివేశారు. మునిరత్నంరెడ్డి, భార్య అరుణ, కుమార్తె హేమశ్రీ(12), మురళి(9)తో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 5గంటల సమయంలో మురళి ఆడుకుంటానని ఇంటి నుండి వెళ్లి రాత్రి పదిగంటలు అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెదకి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించి మూడురోజుల్లోనే మిస్టరీని చేధించారు. -
గంటల్లోనే చేధిస్తాం
తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో బాలుడు దహన ఘటనకు కుటుంబ కలహాలే కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. సత్యనారాయణపురానికి చెందిన టిటిడి ఉద్యోగి మునిరత్నం రెడ్డి కుమారుడు 12 ఏళ్ల మురళి అనే బాలుడి మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. చంద్రగిరి మండలం తొండవాడ బైపాస్ రోడ్డు ప్రక్కన కొందరు గుర్తు తెలియని దుండగులు బాలుడిని హతమార్చి, మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పు అంటించారు. పూర్తిగా కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. నిన్న సాయంత్రం నుంచి మురళి కనిపించకుండాపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. బాబు చేతికి కడియం ఉన్నట్టు ఫిర్యాదులో ఉండడం, మృతదేహానికి కూడా కడియం ఉండడంతో మురళి అని పోలీసులు నిర్థారించారు. క్షేమంగా తిరిగొస్తాడనుకున్న కుమారుడు, కనీసం గుర్తుపట్టనంతగా కాలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు పోలీసులు బృందాలను ఏర్పాటు చేశారు. కుటుంబ సమస్యల గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు. ఆస్తి తగదాలే ఘటనకు కారణమై ఉంటాయన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ నిందితులను ఖచ్చితంగా పట్టుకుంటామని డిఎస్పీ రవిశంకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కొన్ని గంటల్లోనే బాలుడు మృతి కేసును చేధిస్తామని ఆయన సాక్షి టీవీకి చెప్పారు.