మడకశిర మునిసిపాలిటీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం.
మడకశిర, న్యూస్‌లైన్ : మడకశిర మునిసిపాలిటీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. వీధి దీపాల విద్యుత్ బిల్లులను కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మునిసిపాలిటీకి ఏడాదికి దాదాపు రూ.12లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. ఈ నిధులు సిబ్బంది జీతాలు చెల్లించడానికే సరిపోతోంది. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో కార్యాలయ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. మిగిలిన రూ.1.50కోట్ల
నిధులతో డ్రెయినేజీ పనులు చేపట్టాల్సి ఉంది. మిగతా అభివృద్ధి పనులకు నిధులు లేవు. దీంతో వీధిదీపాలు, తాగునీటి పథకాల నిర్వహణ కష్టంగా మారింది. వీధి దీపాల విద్యుత్ బిల్లులు రూ.84 లక్షల వరకు పేరుకుపోయాయి. ట్రాన్స్‌కో అధికారులు నోటీసులు జారీ చేసినా ఫలితం లేదు. గత్యంతరంలేక ట్రాన్స్‌కో అధికారులు వీధి దీపాలకు విద్యుత్ సరఫరాను పలు సార్లు నిలిపి వేశారు. విద్యుత్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంట్‌ను మంజూరు చేయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
అయితే ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపే దీపావళి సమయంలో కూడా వీధిదీపాలకు విద్యుత్ సరాఫరా నిలిపివేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో మునిసిపల్ అధికారులు రూ.2 లక్షలు విద్యుత్ బిల్లులను చెల్లించడంతో తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంట్‌ను మంజూరు చేయించి మునిసిపాలిటీని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.