వేధింపులపై కన్నెర్ర..! | Filed assistant killed by Subramanyam harassmentsa | Sakshi
Sakshi News home page

వేధింపులపై కన్నెర్ర..!

Feb 4 2014 5:42 AM | Updated on Sep 2 2017 3:20 AM

డ్వామా జిల్లా విజిలెన్స్ అధికారి సుబ్రమణ్యం వేధింపుల వల్లే క్షేత్ర సహాయకుడు (ఫీల్డ్ అసిస్టెంట్) మరణించాడని అతని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని

మహబూబ్‌నగర్ వ్యవసాయ, న్యూస్‌లైన్: డ్వామా జిల్లా విజిలెన్స్ అధికారి సుబ్రమణ్యం  వేధింపుల వల్లే క్షేత్ర సహాయకుడు (ఫీల్డ్ అసిస్టెంట్) మరణించాడని   అతని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఉపాధి సిబ్బంది సోమవారం 9 గంటలపాటు ధర్నా చేపట్టారు. తాడూర్ మండల పరిధిలోని ఐతోలు గ్రామానికి చెందిన బి.మల్లయ్య ఈ నెల 1న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే.  ఈ నేపథ్యంలో సోమవారం ఎపిఓలు,టిఏలు , ఎసిఓలు, ఎఫ్‌ఏల సంఘాల అధ్యర్యంలో ఉపాధి సిబ్బంది  ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డ్వామా పీడీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. చివరకు జిల్లా కలెక్టర్ హమీతో విరమించారు.
 
 ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  కేశవులు మాట్లాడుతూ డీవీవో సుబ్రమణ్యం వేధింపుల కారాణంగా మల్లయ్య మరణించాడని ఆరోపించారు.  డ్వామా పీడీ సిసి భరత్‌కుమార్, మల్లయ్య నుండి 15వేలు లంచం తీసుకోని ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఈ ఇద్దరిని విధుల నుంచి తొలగించి,వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.  మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలన్నారు. ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ ధర్నా కార్యక్రమానికి టీజేఏసీ జిల్లా కోకన్వీనర్ బెక్కెం జనార్ధన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంకోటి ముదిరాజ్, టీసీపీఎం జిల్లా నాయకుడు ఖలీల్ తదితరులు మద్దతు తెలిపి మాట్లాడారు.
 
 రూ.లక్ష పరిహారం చెల్లిస్తాం: డ్వామా పీడీ హరిత
 ఆందోళన ప్రారంభమైన రెండు గంటల అనంతరం డ్వామా పీడీ హరిత అక్కడకు చేరుకొని ఉద్యోగులను శాంతింపచేసేందుకు యత్నించారు. మృతుని కుటుంబానికి రూ.1లక్ష పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి సిబ్బంది, యునియన్ నేతలు కోరినట్లుగా ఎక్కువ ఎక్స్‌గ్రేషియో  కోసం సీఆర్‌డీకి నివేదిస్తామని ఆమె తెలిపారు. మృతుడి కుటుంబంలోని వారి విద్యార్హతను పరిశీలించి   కాంట్రాక్ట్ పద్దతిన ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. ఉద్యోగి  సిసి భరత్‌ను ఇప్పటికే కలెక్టర్ ఆదేశానుసారం సరెండర్ చేశామన్నారు. జిల్లా అదనపు జేసీ అతనిపై విచారణ చేపట్టిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
 
 డీవీఓ సుబ్రమణ్యంపై రిపోర్టు తయారుచేసి కలెక్టర్‌కు నివేదిస్తానని తెలిపారు. దాని ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఆయనను విధుల నుండి తొలగించడం తన చేతిలో లేదని స్పష్టం చేశారు.అయినా సిబ్బంది పట్టు వీడలేదు. వివిధ అంశాలపై ఆందోళన కారులకు, పీడీకి మధ్య చర్చలు జరిగినా అవి ఫలించలేదు. చివరికి 4.30 గంటల వేళ వారు కలెక్టరుతో చర్చలకు వెళ్లారు.
 
 రోడ్డుపై బైఠాయింపు....
 కలెక్టర్ గిరిజాశంకర్‌ను కలిసేందుకు వెళ్లిన వారికి సాయంత్రం 6.30 గంటల వరకూ అనుమతి లభించలేదు. దీంతో మళ్లీ ఆందోళన కారులు ప్రతినిధులు డ్వామా కార్యాలయానికి నిరాశగా చేరుకోవడంతో అంతా కలిసి  ఆగ్రహంతో రాయచూర్ రోడ్డుపై బైఠాయించారు.
 
  అరగంట పాటు రోడ్డుపై ధర్నా చేశారు. వన్‌టౌన్ సిఐ బాలాజీ అక్కడికి చేరుకొని అందోళన కారులను శాంతింప చేశారు. చివరికి యూనియన్ నేతలు కలెక్టరును కలిసి ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారని ప్రకటించడంతో  ధర్నా విరమించారు. మల్లయ్య  కుటుంబానికి పరిహారం ,  క్షేత్రసహాయకుడి ఉద్యోగం అతని కుటుంబీకుల్లో ఒకరికి ఇచ్చేందుకు కలెక్టరు అంగీకరించినట్లు తెలిపారు.
 
 డీవీవో,సిసిలపై విచారణకు అదనపు జేసీ అధ్యర్యంలో  కమిటీ వేసినట్లు ఆ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్  ఒప్పుకున్నారని ఆందోళనకారులకు వెళ్లడించారు.దీంతో వివాదం ముగిసింఇద. ఈ కార్యక్రమంలో ఎపిఓల జిల్లా అధ్యక్షుడు సాయిశంకర్, టిఏల జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, ఏసిఓల జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్,ఎస్సీ, ఎస్టీ ఉపాధి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement