మీరు వైఎస్సార్‌సీపీ వాళ్లు.. ఉపాధి పని ఇవ్వం! | Field assistant prevented employment from working | Sakshi
Sakshi News home page

మీరు వైఎస్సార్‌సీపీ వాళ్లు.. ఉపాధి పని ఇవ్వం!

May 22 2026 3:30 AM | Updated on May 22 2026 3:30 AM

Field assistant prevented employment from working

పని ప్రదేశం వద్ద ఆందోళనకు దిగిన ఉపాధి కూలీలు

పనిచేయనివ్వకుండా అడ్డుకున్న ఫీల్డ్‌అసిస్టెంట్‌ 

ఈ విషయంలో జనసేన నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందన్న సదరు ఉద్యోగి   

ఉప ముఖ్యమంత్రి, ఉపాధి హామీ మంత్రి ఇలాకాలోనే దారుణం 

పేదల పొట్టకూటిపై రాజకీయాలు ఏంటంటూ ఉపాధి కూలీల ఆగ్రహం  

ఆరు గంటల పాటు ఆందోళన 

పిఠాపురం: రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఉపాధి హామీ మంత్రి పవన్‌కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఉపాధి పనుల కల్పనలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులంటూ పలువురికి పని కల్పించకుండా ఫీల్డ్‌ అసిస్టెంట్ల ద్వారా జనసేన నేతలు అడ్డుకోవడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. 

‘మీరు వైఎస్సార్‌సీపీకి చెందినవారు. కాబట్టి మీకు ఉపాధి పనులు కల్పించేది లేదు’ అంటూ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఇంటి వీరబాబు గురువారం ఐదుగురు మేట్లకు (గ్రూప్‌ లీడర్లు) పని కల్పించకుండా నిర్దాక్షిణ్యంగా అడ్డుకున్నాడు. తనకు జనసేన నేతల నుంచి ఈ విషయంలో తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పుకున్నాడు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నిర్వాకంపై  ఐదుగురు మేట్ల కింద పనిచేసే దాదాపు 250 మంది కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిరుపేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకంలో రాజకీయాలు ఏంటంటూ వందలాది మంది కార్మికులు పనిప్రదేశం వద్దే తీవ్ర ఆందోళన చేపట్టారు.  దుర్గాడ గ్రామంలో గత 15 సంవత్సరాల కాలంలో ఉపాధి పథకంలో ఎన్నడూ ఇటువంటి దారుణమైన రాజకీయం చూడలేదని, ఉపాధి హామీలో రాజకీయం చేసిన వ్యక్తులు ఎవరో బయటపెట్టాలని కూలీలు డిమాండ్‌ చేశారు.   ఈ పరిస్థితుల్లో  ఉదయం ఐదున్నర గంటలకు పని ప్రదేశానికి చేరుకున్న ఉపాధి కూలీలు 11 గంటల వరకు ఎండలోనే కూర్చున్నారు.  

విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు, గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగ లోవరాజు అధికారులతో మాట్లాడారు. దీంతో గొల్లప్రోలు ఎంపీడీవో సెలెట్‌ రాజు కార్మికులు ఆందోళన చేస్తున్న చోటుకు చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన ఎంపీడీవో.. ఎట్టకేలకు లాగిన్‌ నిలిపివేసిన మేట్లకు లాగిన్‌ పునరుద్ధరించడంతో సమస్య అప్పటికి సద్దుమణిగింది.  

తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు 
ఫీల్డ్‌ అసిస్టెంట్‌  వీరబాబు మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. 15 రోజులు పనికి వస్తే కేవలం వారం రోజులకే నమోదు చేస్తున్నాడు. తనకు నచ్చినవారికి, తాను మెచ్చిన వారికి మాత్రం పనికి రాకపోయినా హాజరు నమోదు చేస్తున్నాడు. రాజకీయ దురుద్దేశంతోనే తమ ఉపాధి మేట్ల లాగిన్లు నిలిపివేశాడు. జనసేన నాయకులతో చేతులు కలిపి ఉపాధి పథకంలో అక్రమాలకు పాల్పడుతున్నాడు.   – ఉపాధి కూలీల ఆవేదన 

ఉపాధి కూలీలతో రాజకీయం చేస్తే ఊరుకోం 
పొట్టకూటి కోసం మండుటెండలో కష్టపడుతున్న నిరుపేదలపై రాజకీయం చేయడం  పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడే చూస్తున్నాం.  పేదల పొట్ట కొట్టడానికి ఎవరు ప్రయత్నించినా ఊరుకునేది లేదు.  ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడంతోపాటు దుర్గాడలో రాజకీయం చేస్తున్న ఉపాధి సిబ్బందిపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి. మళ్లీ ఇటువంటి ఘటన జరిగితే తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది. – వంగా గీతావిశ్వనాథ్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ 

Advertisement
 
Advertisement
Advertisement