సమైక్యవాదులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ బిల్లును ఏకపక్షంగా అసెంబ్లీకు తీసుకు రావడాన్ని నిరసిస్తూ నిరసనలు చేపట్టారు.
సాక్షి, నెల్లూరు : సమైక్యవాదులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ బిల్లును ఏకపక్షంగా అసెంబ్లీకు తీసుకు రావడాన్ని నిరసిస్తూ నిరసనలు చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేదిలేదని ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారపార్టీ కుట్రపూరితంగా రాష్ట్ర విభజనకు పూనుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరంలోని గాంధీబొమ్మ కూడలిలో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రిలేనిరాహారదీక్షలు కొనసాగాయి. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు గాంధీబొమ్మ కూడలిలో నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం భిక్షాటన చేశారు. అదే విధంగా ఆనం జయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సమై క్య ఆందోళన జరిగింది. స్థానిక పెద్దబజార్‌సెంటర్ నుంచి చిన్నబజారుమీదుగా ములుముడి బస్టాండ్ సెంటర్ వరకు సమైక్యవాదులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. వెంకటగిరి పట్టణంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థల బంద్ పాటించారు. పొదలకూరులో విద్యార్థి జేఏసీ, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ పాటించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.