సెలవు రోజైనా.. పండగైనా సమైక్యాంధ్ర కోసం అలుపెరగని పోరాటం కొనసాగుతోంది. బిగిసిన పిడికిళ్లు.. దిక్కులు పిక్కటిల్లేలా నినదించే గొంతుకలు రోజురోజుకు ఉద్యమ తీవ్రతను పెంచుతున్నాయి. మేము సైతం అంటూ పిల్లలు కూడా రిలే నిరాహార దీక్ష చేపట్టడం సమైక్యవాదుల పోరాట పటిమకు నిదర్శనం.
సాక్షి, కర్నూలు: సెలవు రోజైనా.. పండగైనా సమైక్యాంధ్ర కోసం అలుపెరగని పోరాటం కొనసాగుతోంది. బిగిసిన పిడికిళ్లు.. దిక్కులు పిక్కటిల్లేలా నినదించే గొంతుకలు రోజురోజుకు ఉద్యమ తీవ్రతను పెంచుతున్నాయి. మేము సైతం అంటూ పిల్లలు కూడా రిలే నిరాహార దీక్ష చేపట్టడం సమైక్యవాదుల పోరాట పటిమకు నిదర్శనం. వినాయక చవితి రోజైన సోమవారం, మంగళవారం రోజుల్లో వినూత్న నిరసనలు చేపట్టారు.
విభజనవాదులకు సద్బుద్ధి ప్రసాదించాలని గణనాథుడిని వేడుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వెనక్కు తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధిస్తామని సమైక్యవాదులు హెచ్చరించారు. నగరంలో తరగతులు నిర్వహిస్తున్న పలు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను ఉపాధ్యాయులు మూసివేయించారు. జిల్లా జూని యర్ లెక్చరర్ల జేఏసీ అధ్యక్షుడు కె.చెన్నయ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర విభజనకు కారణమయ్యారంటూ సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్, చిదంబరం, బొత్స సత్యనారాయణ, కేసీఆర్ చిత్రాలతో కూడిన దిష్టిబొమ్మను కేసీ కెనాల్‌లో నిమజ్జనం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఎన్టీఆర్ సర్కిల్‌లో రాస్తారోకో చేపట్టారు.
వాణిజ్య పన్నుల ఉద్యోగులు ఆ శాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపైనే బైఠాయించారు. రాజకీయ నాయకులకు సద్బుద్ధి ప్రసాదించి, సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములయ్యేలా చూడాలనే పోస్టర్లతో గణనాథుడిని వేడుకున్నారు. ఆర్టీసీ కార్మికుల నిరవధిక దీక్షతో జిల్లాలోని 970 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆదోనిలో ఐదో తరగతి విద్యార్థులు 14 మంది జేఏసీ ఆధ్వర్యంలో భీమాస్ సర్కిల్ ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని సంఘీభావం తెలపడం విశేషం.
ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి గాంధీ సెంటర్‌లో రిలే దీక్షలు చేపట్టారు. ఆత్మకూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష కొనసాగుతోంది. ఉపాధ్యాయులు వినాయకుడి వద్ద భజన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. డోన్ పట్టణంలో బలిజ సమైక్య శంఖారావం పేరుతో బలిజ సంఘీయులు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై వంటావార్పు చేపట్టి సహపంక్తి భోజనం చేశారు.