
నెల్లూరు(క్రైమ్): జీవితంలో ప్రతి మలుపులో నాన్నే ప్రేరణ. ఆయనే నాకు రోల్‌మోడల్. నాన్న వి.సత్యనారాయణరెడ్డి వ్యవసాయం చేస్తూనే మమ్మల్ని ఉన్నత చదువులు చదివించారు. వ్యవసాయ పనులను సైతం నేర్పించారు. మా అభిప్రాయాలకు ఎంతో విలువనిచ్చేవారు. ఏది ఒప్పో, తప్పో మాతోనే చెప్పించేవారు. విశాల దృక్పథం అలవర్చారు. చిన్నప్పట్టి నుంచి ప్రతి అంశాన్ని పాఠంలా బోధించేవారు. ప్రపంచాన్ని ఎలా చూడాలన్న విషయాన్ని ఆయన ఆలోచనల నుంచే నేర్చుకొన్నాం. ప్రజా సేవకు ఉండే ప్రాధాన్యాన్ని నేర్పారు. ఏ పనిచేసినా పది మందికి ఉపయోగపడాలని చెప్పేవారు. ఒక స్నేహితుడిలా మార్గదర్శకం చేశారు. నాన్న ప్రేరణతో పోలీసుశాఖలో చేరాను. ప్రజలకు సేవచేయాలన్న ఆయన ఆశయాన్ని కొనసాగిస్తున్నాను. నాన్నే నా ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్. అలాంటి నాన్నకు కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. నాన్న నుంచి నేర్చుకొన్నదే నా బిడ్డలకు నేర్పుతున్నాను.