నాన్నే.. బలితీసుకున్నాడు | Father only killer | Sakshi
Sakshi News home page

నాన్నే.. బలితీసుకున్నాడు

Jul 30 2015 3:49 AM | Updated on Sep 2 2018 3:46 PM

భార్యతో నిత్యం గొడవలు పడుతుండేవాడు.. చిత్రహింసలు పెట్టేవాడు

♦ చిన్నారిని పొట్టనబెట్టుకున్న కన్నతండ్రి
♦ అమ్మను కొడుతున్నావని అడిగినందుకు.. బావిలో తోసేశాడు..
♦ మృతి చెందిన బాలిక వివరాలు లభ్యం
♦ పరారీలో తండ్రి రమేష్
 
 విజయనగరం క్రైం :  భార్యతో నిత్యం గొడవలు పడుతుండేవాడు.. చిత్రహింసలు పెట్టేవాడు. కళ్ల ముందే అమ్మ పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయిన ఆ పసి మనసు.. తెలిసీతెలియని వయసులో, వచ్చీరాని మాటలతో తండ్రిని ఎదిరించింది. పోలీసులకు చెబుతానని హెచ్చరించింది. ఎంతైనా కన్నపేగు.. అందులోనూ పసి మనసు అన్న ఇంగితజ్ఞానం కూడా లేని ఆ కసాయి తండ్రి.. కడుపులో పెట్టి చూసుకోవాల్సిన చిన్నారిని ‘పొట్టన పెట్టుకున్నాడు’. అభంశుభం తెలియని చిన్నారి పట్ల కాలయముడిగా మారాడు.

పట్టణంలోని కొత్తపేట నీళ్లట్యాంకు సమీపంలో బావిలో విగతజీవిగా తేలిన బాలిక వివరాలు లభ్యమయ్యాయి. కన్నతండ్రే ఆమెను కర్కశంగా హత్య చేశాడని తేలింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలెం గ్రామంలో గరే రమేష్, వెంకట జ్యోతిర్మయి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ప్రణీత (8), సౌమ్య (6)లతోపాటు, మూడేళ్ల  బాలుడు ఉన్నారు. రమేష్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసేవాడు. ఉద్యోగం నుంచి  తొలగించడంతో తమిళనాడు సీమెన్ ట్రైనింగ్‌కు వెళ్లాడు. 

శిక్షణ పొందిన తర్వాత కూడా రమేష్‌కు ఉద్యోగం రాలేదు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య నిత్యం తగదాలు జరిగేవి. ఈ నెల 26న రాత్రి కూడా వారి మధ్య మరోమారు గొడవ జరిగింది. తెలియనితనంలో రెండో కుమార్తె  సౌమ్య తండ్రి రమేష్‌ను హెచ్చరించింది. ప్రతి సారీ అమ్మను కొడుతున్నావని, పోలీసులకు, అమ్మమ్మ వాళ్లకు చెబుతానని బెదిరించింది. దీంతో అందరూ పడుకున్నాక సౌమ్యను తండ్రి రమేష్ విజయనగరం తీసుకువచ్చి కొత్తపేట నీళ్లట్యాంకు సమీపంలోని బావిలో పడేశాడు.

ఆ సందర్భంలో రమేష్ ఫోన్ సమీపంలో పడిపోయింది. కుటుంబ సభ్యులు సెల్‌నంబరుకు ఫోన్ చేయడంతో అటుగా వెళ్తున్న వ్యక్తి తీసి మాట్లాడాడు. గుర్తుతెలియని పాప  బావిలో పడి మృతిచెంది ఉందని చెప్పడంతో బుధవారం వారంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే తల్లి జ్యోతిర్మయి భర్త రమేష్‌పై ఫిర్యాదు చేసింది. చిన్నారి మృతదేహానికి జిల్లా కేంద్రాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రస్తుతం రమేష్ పరారీలో ఉన్నాడు. టూటౌన్ ఎస్సై సీహెచ్ శ్రీధర్ కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement