నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి.

Father And Daughter Died In Road Accident - Sakshi

జాతీయ రహదారి216లో ఘోర రోడ్డు ప్రమాదం

పటవల వద్ద రెండు బైక్‌లను ఢీకొన్న కారు

తండ్రీకూతుళ్ల దుర్మరణం

మరొకరికి తీవ్ర గాయాలు

ఉన్నత చదువులు చదవాలి.. ఉన్నత స్థాయికి ఎదగాలనేది ఆమె ఆశ.. దానికి తగ్గట్టుగానే ఆమె తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఆమె కూడా ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో 87.8 శాతం మార్కులు సాధించింది.

దగ్గర బంధువులందరూ ఇంజినీర్లు కావడంతో ఆమె కూడా సాఫ్ట్‌వేర్‌ కావాలనే ఆకాంక్షను కుటుంబ సభ్యుల వద్ద వెలిబుచ్చేది. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం కోరంగిలోని కైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన ఎంట్రన్స్‌ పరీక్షకు తండ్రితో పాటు బైక్‌పై వెళ్లింది.

పరీక్ష రాసిన అనంతరం ఇంటికి బయల్దేరిన వీరిని తాళ్లరేవు మండలం పటవల వద్ద అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఆమె ఆశలను చిదిమేసింది. ఈ ప్రమాదంలో తండ్రితో పాటు ఆమె ప్రాణాలు కోల్పోయింది.

అతివేగంగా దూసుకొచ్చిన కారు..,  ఓ వ్యక్తి బైక్‌పై నిర్లక్ష్యంగా రోడ్డుపైకి దూసుకురావడం వల్ల జరిగిన ప్రమాదంలో తండ్రీ కూతురు బలి కావలసి వచ్చిందని పలువురు వాపోతున్నారు. 

– తాళ్లరేవు (ముమ్మిడివరం), సర్పవరం (కాకినాడ సిటీ). అతివేగంగా దూసుకెళ్లిన కారు.. నిర్లక్ష్యంగా రోడ్డుపైకి వచ్చిన మోటారుసైక్లిస్ట్‌.. కారణంగా తండ్రీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి 216లోని పటవల వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కాకినాడకు చెందిన దాట్ల శ్రీరామరాజు(45), ఆయన కుమార్తె దాట్ల లక్ష్మీహిమజ(17) దుర్మరణం పాలయ్యారు.

ఈ ప్రమాదంలో పటవలకు చెందిన రెడ్డి శ్రీను అనే వ్యక్తి తీవ్రగాయాలపాలు కాగా, కారులో ప్రయాణిస్తున్న వి.మల్లికార్జునవర్మ, అతడి తల్లికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు, కోరంగి పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ మధురానగర్‌ లక్ష్మీగణపతి వీధికి చెందిన దాట్ల శ్రీరామరాజు తన కుమార్తె దాట్ల లక్ష్మీ హిమజను తీసుకుని కోరంగి కైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు మంగళవారం ఉదయం వచ్చారు. విజ్ఞాన్‌ యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ రాసిన అనంతరం కాకినాడ తిరుగు ప్రయాణమయ్యారు.

అయితే వారు ఇంటికి చేరుకునేలోపు విధి కాటేసింది. పటవల ఫైర్‌ ఇనిస్టిట్యూట్‌కు సమీపంలోకి వచ్చే సరికి పటవల ఊరిలో నుంచి హైవేపైకి వచ్చేందుకు గల కంకర రోడ్డులో నుంచి రెడ్డి శ్రీను అనే వ్యక్తి నిర్లక్ష్యంగా బైక్‌పై వేగంగా హైవేపైకి రావడంతో కాకినాడ నుంచి భీమవరం వెళుతున్న డబ్ల్యూబీ02 ఏఏ5929 నంబర్‌ గల కారు అతి వేగంగా వెళుతూ శ్రీను బైక్‌ని ఢీకొంది. అత్యంత వేగంగా వెళుతున్న కారు నియంత్రణలోకి రాకపోవడంతో అదే సమయంలో అటుగా వస్తున్న శ్రీరామరాజు బైక్‌ను కూడా కారు వేగంగా ఢీకొట్టింది.

తండ్రీ, కూతురు గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న తుప్పల్లో పడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఇరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో శ్రీను కాలు విరిగి తీవ్రగాయాలపాలయ్యాడు. అలాగే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వీరిని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కోరంగి ఎస్సై సుమంత్‌ బృందం సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

కారు డ్రైవర్‌ వి.మల్లికార్జునవర్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో వైద్యం చేయించేందుకు భీమవరం తీసుకు వెళుతున్నట్టు మల్లికార్జునవర్మ పోలీసులకు తెలిపాడు. మృతదేహాలను పోస్టుమార్టమ్‌ నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. లక్ష్మీ హిమజ కాకినాడ ఆదిత్య కళాశాలలో ఇటీవలే ఇంటర్‌ పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం పరీక్షలు రాస్తుంది.

హృదయ విదారకంగా జరిగిన ఈ ఘటనను చూసి స్థానికులు చలించిపోయారు. తండ్రీకూతుళ్లు ఒకేసారి మృతిచెందడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. చదువులో మేటిగా ఉండి ఉన్నత స్థాయికి ఎదుగుతుందనే ఆశలుపెట్టుకున్న ఆ కుటుంబానికి దాట్ల లక్ష్మీహిమజ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి సుజాత, సోదరుడు అశృతవర్మలు హిమజ మరణవార్తతో కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top