రాజధాని నగరానికి భూమి ఇచ్చిన రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 15-20 వేల వరకు నష్టపరిహారం ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు తెలిపారు.
రాజధాని నగరానికి భూమి ఇచ్చిన రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 15-20 వేల వరకు నష్టపరిహారం ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు తెలిపారు. ఇలా ఐదు నుంచి పదేళ్ల పాటు ఇవ్వాలనుకుంటున్నామని, అయితే ఒకవేళ రైతులు భూమిని అమ్ముకుంటే మాత్రం డబ్బులు ఇవ్వడం ఆపేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. సేకరించిన భూమిలో 50 శాతమే నిర్మాణాలకు సరిపోతుందని, మరో 40 శాతాన్ని రైతులకు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నామన్నారు.
విజయవాడ సమీపంలోని అటవీ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనుకూలంగా లేదని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. వీజీటీఎం మొత్తం ప్రాంతాన్ని కలిపే దిశలో ఇప్పుడు ఆలోచిస్తున్నామన్నారు. రాబోయే వారం, పది రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుందని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ జరిపేచోట క్రయ విక్రయాలు నిలిపేస్తామని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా భూమి సేకరించాలని సీఎం చంద్రబాబు చెప్పారని, ఆరోతేదీ సమావేశం తర్వాత ల్యాండ్ పూలింగ్ తేదీలు ఖరారు చేస్తామని వివరించారు.