అకాల వర్షం.. భారీగా పంట నష్టం | farmers losses due to untimely rains | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. భారీగా పంట నష్టం

Mar 3 2014 12:10 AM | Updated on Oct 16 2018 3:12 PM

మెదక్‌లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారా యి.

మెదక్ టౌన్, న్యూస్‌లైన్:  మెదక్‌లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారా యి. ప్రధాన కూడలి అయిన రాందాస్ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా, ఆటో నగర్, పోస్టాఫీస్ తదితర ప్రాంతాల్లోని ప్రధాన రోడ్డుపై మోకాలు లోతు నీరు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొన్నారు. ఫుట్‌పాత్ వ్యాపారులు నానా అవస్థలు పడ్డారు. పలు కోచింగ్‌లకు వెళ్లే విద్యార్థులు తడుస్తూ వెళ్లారు.

 వాటర్ ట్యాంక్ పై కూలిన చెట్టు
 మెదక్ రూరల్: మండల పరిధిలోని పలుగ్రామాలలో ఆదివారం భారీ వర్షం కురవగా.. మరికొన్ని గ్రామాల్లో వడగండ్ల వర్షం పడింది. మండల పరిధిలోని శమ్నాపూర్, హవేళిఘణపూర్, మక్తభూపతిపూర్, చౌట్లపల్లి గ్రామాల్లో వడగండ్ల వర్షం పడగా చాలా గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో చౌట్లపల్లిలో గ్రామంలో వాటర్ ట్యాంక్‌పై ఓ చెట్టు కూలిపోగా నల్లా పైపులు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా మరికొన్ని గ్రామాల్లో రాళ్ల వర్షానికి మామిడి పూత, పిందెలు నేలరాలాయి. దీంతో మామిడి రైతులకు నష్టం వాటిల్లింది.

 ఈదురు గాలులు, వడగండ్ల వర్షం
 రామాయంపేట: మండలంలోని ఆదివారం ఈదురు గాలులు, వడగండ్ల వాన  కారణంగా సుమారు 30 ఎకరాల్లో సాగు చేసిన వివిధ పంటలు చేతికి అందకుండా పోయాయి. దంతేపల్లి తీన్ నంబర్ సేవాదాస్ తండా రైతు పాత్లోత్ శంకర్ మూడెకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న, రెండెకరాల్లో సాగు చేసిన ఆముదం, అర ఎకరం ఉల్లి  పంటలు నేలకొరిగాయి. అదేవిధంగా సభావత్ వేవీ సింగ్ సాగు చేసిన అర ఎకరం మొక్కజొన్న, సభావత్ భిక్షపతికి చెందిన అర ఎకరం మిరప పంట, రెండెకరాల మొక్కజొన్న, రైతు మెగావత్ రవి ఎకరంలో సాగు చేసిన మొక్కజొన్న పంట తుడిచిపెట్టుకుపోయాయి.

మరో రైతు సభావత్ కమ్లియా అర ఎకరంలో సాగు చేసిన మొక్కజొన్న, పాత్లోత్ చాస్లీ అరెకరంలో సాగు చేసిన  మొక్కజొన్న, సభావత్ అమ్రియాకు చెందిన రెండెకరాల మొక్కజొన్న, సభావత్ బానీకి చెందిన ఎకరం మొక్కజొన్న పంటలు వడగండ్ల వాన, ఈదురు గాలులతో పంటలు పూర్తిగా నేల కొరిగాయి. అదేవిధంగా ఈదురు గాలులు, వడగండ్ల వానతో విద్యుత్ వైర్లు, స్తంభాలు నేలకొరిగినట్లు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

 చిన్నకోడూరు మండలంలో వర్ష బీభ త్సం
 చిన్నకోడూరు: అకాల వర్షానికి మండలంలో మిర్చి, ఉల్లిగడ్డ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం నుంచి కురుస్తున్న వర్షాలకు చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్, గంగాపూర్, రంగాయపల్లి తదితర గ్రామాల్లో సుమారు 400 ఎకరాల్లో మిర్చి, ఉల్లిగడ్డ, బీర్నీసు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలకు నష్టం వాటిల్లింది. కొందరు రైతులు తడిసిన పంటను కాపాడుకోవడాని కి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

 పాపన్నపేటలో వడగళ్ల వర్షం
 పాపన్నపేట : మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. మండలం అంతటా ఓ మోస్తరు వర్షం పడింది. రెండు రోజులుగా అడపా దడపా కురుస్తున్న వర్షాలతో మామిడి పిందెలు రాలిపోయాయి. ఏడుపాయల జాతరలో భక్తులు నానా అవస్థలు పడ్డారు. కాగా ఈ వర్షంతో వరి పంటకు రోగాలు పోతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సన్నగా కురిసిన వడగళ్లతో కొంతమేర మొక్కజొన్న, ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement