రైతు ప్రాణం తీసిన ‘పసుపు–కుంకుమ’

farmer commit suicide in chittoor over Pasupu Kumkuma Scheme issue - Sakshi

భార్యకు డ్వాక్రాలో డబ్బులు ఇవ్వని గ్రూపు లీడర్‌

దీనిపై ఆమెతో కుమారుల గొడవ

మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో ఘటన  

సాక్షి, కురబలకోట (చిత్తూరు జిల్లా): ప్రభుత్వ పసుపు– కుంకుమ పథకం కారణంగా ఓ రైతు భార్య తన ‘పసుపు, కుంకుమ’ కోల్పోయింది. డ్వాక్రా గ్రూపుల్లో నగదు పంపిణీ సక్రమంగా జరక్కపోవడంతో చోటుచేసుకున్న గొడవ కారణంగా మనస్తాపం చెందిన రైతు రెండు రోజుల కిందట ఇల్లు వదిలి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం రోడ్డు పక్కన నిర్జన ప్రదేశంలో రేకుల షెడ్డులో ఆయన శవం లభ్యమైంది. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి చిత్తూరు జిల్లా ముదివేడు ఎస్‌ఐ నెట్టి కంఠయ్య కథనం ప్రకారం.. కురబలకోట మండలం పుల్లగూరవారిపల్లెకు చెందిన పి.నరసింహారెడ్డి (66) వ్యవసాయదారుడు. అతనికి భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజమ్మ డ్వాక్రా గ్రూపులో ఉంది. 

పసుపు–కుంకుమ కింద తొలి విడత రూ. 2,500 వచ్చింది. ఆ తర్వాత రావాల్సిన డబ్బు రూ. 7,500 ఇవ్వలేదు. ఈ విషయమై ఆయన కుమారులు నాలుగు రోజుల కిందట డ్వాక్రా గ్రూపు లీడర్‌ను అడిగారు. కొంత డబ్బు ముట్టచెబితే ఇస్తామని ఆమె చెప్పడంతో వారి మధ్య గొడవ మొదలయ్యింది. అసలే ఘర్షణలు, కొట్లాటలు ఏమాత్రం నచ్చని నరసింహారెడ్డి కుమారులను వారించాడు. కోపంలో ఉన్న కుమారులు తన మాట వినకపోవడంతో నరసింహారెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ముదివేడు క్రాస్‌కు పనిమీద వెళుతున్నానని వెళ్లిన ఆయన కన్పించకుండా పోయాడు. 

బుధవారం ఉదయం ముదివేడు క్రాస్‌ దగ్గర అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనున్న ఓ రేకుల షెడ్డులో రైతు శవమై కన్పించాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శవం కుళ్లిన స్థితికి చేరుకోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పోలీసులు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. శవం పక్కన పురుగుమందు డబ్బాలు కన్పించాయని, దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్న వివాదం కారణంగా కుటుంబపెద్ద ప్రాణాలు తీసుకోవడంతో భార్య, కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పసుపు–కుంకుమ డబ్బుల వల్ల దారితీసిన గొడవతో రైతు మృతి చెందడంపై వెలుగు అధికారులను విచారించగా.. డ్వాక్రా సభ్యురాలికి డబ్బులు ఇవ్వని సమస్య తమ దృష్టికి రాలేదన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top