ఈదురు గాలుల విధ్వంసం

Fani Cyclone Effect on Vizianagaram Srikakulam - Sakshi

వేపాడ, జామి, ఎల్‌.కోట మండలాల్లో నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు

రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లు

నాశనమైన బొప్పాయి, అరటి తోటలు

నేలరాలిన మామిడి

అంధకారంలో పలు గ్రామాలు

పిడుగుపాటుకు ఆవు మృతి

ఎస్‌.కోట నియోజకవర్గంలోని వేపాడ, జామి, ఎల్‌.కోట మండలాల్లో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. చెట్లు నేలకూలాయి. అరటి, బొప్పాయి తోటలు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. పల్లెల్లో అంధకారం అలముకుంది. పిడుగుపాటుకు జామి మండల కేంద్రంలోని దొండపర్తి కూడలిలో ఒక ఆవు మృతి చెందింది. గాలుల ధాటికి జనం బెంబేలెత్తిపోయారు. ఇళ్లకు పరుగుతీశారు. తీరా.. చిరుజల్లులే కురవడంతో రైతులు నిరాశచెందారు.

వేపాడ/జామి/ఎల్‌.కోట: ఎస్‌.కోట నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులకు జనం భయంతో పరుగు తీశారు. ఎక్కడికక్కడే చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో భయపడ్డారు. గాలుల ధాటికి వేపాడ మండలంలోని ఎస్‌కేఎస్‌ఆర్‌ పురంలో విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్‌ నేలకొరిగింది. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దిబ్బపాలెంలో పశువుల పాకలు కూలిపోయాయి. ఎస్‌కేఆర్‌ పురానికి చెందిన రైతు శిరికి ఈశ్వరమ్మకు చెందిన సుమారు 5.60 ఎకరాల బొప్పాయి తోట ధ్వంసమైంది. సుమారు రూ.25 లక్షల పంట చేతికొచ్చేదశలో నష్టపోయామంటూ ఆమె గగ్గోలు పెడుతోంది. చామలాపల్లి పంచాయతీ పోతుబందిపాలెంగిరిజన గ్రామంలో విద్యుత్‌ స్తంభాలు ఇళ్లపై పడడంతో జనం పరుగులు తీశారు. విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. లక్కవరపుకోట మండలంలో సాయంత్రం కురిసిన చిరుజల్లులకు వాతావరణం చల్లబడింది. ఈదురు గాలులకు ఎల్‌.కోట బీసీ కాలనీలో తాటి చెట్టు బి.పార్వతమ్మ ఇంటిపై కూలిపోయింది. దీంతో ఇంటిగోడ కూలిపోయే స్థితికి చేరింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అరకు–విశాఖ ప్రధాన రోడ్డులో సోంపురం జంక్షన్‌ సమీపంలో తాటిచెట్టు విద్యుత్‌ తీగెలపై పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎస్సై ప్రయోగమూర్తి జేసీబీ సాయంతో తాటిచెట్టును తొలిగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈదురు గాలులకు సుమారు 8 విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో మండలంలో పూర్తిగా విద్యుత్‌కు అంతరాయం కలిగింది.

జామి మండలంలో పిడుగులు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. ఫొని తుపాను ఎలాంటి ప్రభావం చూపకపోగా ఒక్కసారి ఈదురుగాలులు ధాటిగా వీయడం, పిడుగులు పడడంతో జనం భయపడ్డారు. జామి మండలంలో మొత్తం 21 విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. కె.భీమసింగిలో–5, జామి, శ్రీచక్ర సిమ్మెంట్‌ ఫ్యాక్టరీ మధ్యలో 7, ఏ.ఆర్‌.పేటలో 5, కొత్తూరులో 2, గొడికొమ్ములో ఒకటి, అలమండలో ఒకటి చొప్పున విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్‌ తీగెలు తెగిపోయాయి. గాలుల బీభత్సానికి విద్యుత్‌ శాఖకు సుమారు రూ.3 లక్షల ఆర్థిక నష్టం చేకూరిందని జామి విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. కె.భీమసింగి, యాతపాలెం, చిల్లపాలెం తదితర గ్రామాలకు మంగళవారం సాయంత్రానికి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు.

మామిడి పంటకు అపారనష్టం
అసలే ఈ ఏడాది అరకొరగా మామిడిపంటతో మామిడి రైతులు ఆందోళనలో ఉన్నారు. సోమవారం వీచిన గాలులకు మామిడిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో ఎక్కడికక్కడ మామిడి కాయలు నేలరాలాయి. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.

పిడుగుపడి ఆవు మృతి..
జామి మండల కేంద్రంలోని దొండపర్తి జంక్షన్‌ వద్ద కొత్తలి రాంబాబుకు చెందిన సుమారు రూ.50వేలు విలువ చేసే ఆవు పిడుగుపాటుకు గురై మృతిచెందింది. కల్లాంలోని ఓ చెట్టుకింద ఉన్న ఆవుపై పిడుగు పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎక్కడికక్కడే భారీ శబ్దంతో పిడుగులు పడడంతో మండల వాసులు భయాందోళన చెందారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top